Maddila Gurumurthy | చెల్లింపులో జాప్యం..

Maddila Gurumurthy | తిరుపతి బ్యూరో, ఆంధ్రప్రభ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేసే కూలీలకు వేతనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యాల పై తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. ప్రస్తుతం కూలీల వేతనాల కోసం ప్రత్యేక గ్రీన్ ఛానల్ లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పై ఆధారపడాల్సి వస్తోందని, దీని కారణంగా పేద గ్రామీణ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.
కార్మికుల వేతన భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రక్రియల నుంచి వేరు చేసి, కేంద్ర ప్రభుత్వం నేరుగా కూలీల ఖాతాల్లో జమ చేసే విధానాన్ని తీసుకురావాలని ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు.ఈ ప్రశ్నకు సమాధానంగా గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేశ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ఇప్పటికే జాతీయ ఎలక్ట్రానిక్ నిధుల నిర్వహణ వ్యవస్థ ద్వారా కూలీల వేతనాలను కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. ఈ విధానం ద్వారా మధ్యవర్తి దశలు తొలగిపోయి, వేతనాల చెల్లింపులో పారదర్శకతతో పాటు వేగం కూడా పెరిగిందని చెప్పారు.
అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో భాగంగా ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ అమలు చేస్తున్నామని దీని వల్ల చెల్లింపుల తిరస్కరణలు గణనీయంగా తగ్గాయని వివరించారు. దేశవ్యాప్తంగా 2025 డిసెంబర్ 11 నాటికి 12.16 కోట్ల క్రియాశీల కూలీలలో 99.67 శాతం మందికి ఆధార్ సీడింగ్ పూర్తైందని, 99 శాతం మందికి పైగా కూలీలు నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లో వేతనాలు పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర స్థాయి పరిపాలనా జాప్యాల వల్ల కూలీలు నష్టపోకుండా ఉండేందుకు జాతీయ ఎలక్ట్రానిక్ నిధుల నిర్వహణ వ్యవస్థ ఇప్పటికే సమర్థవంతంగా పని చేస్తోందని నిధులను వివిధ స్థాయిల్లో నిల్వ చేయకుండా నేరుగా కూలీలకు వేతనాలు చెల్లించడాన్ని ఈ వ్యవస్థ నిర్ధారిస్తోందని మంత్రి తెలిపారు.
