ఫుడ్ పాయిజనింగ్ పై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్..

హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లి మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్‌లో ఇటీవల జరిగిన ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (TGSCPCR) తీవ్రంగా స్పందించింది.

కమిషన్ సభ్యురాలు వందనా గౌడ్, హైదరాబాద్ జిల్లా బాలల సంరక్షణ అధికారి (DCPO) శ్రీనివాస్‌తో కలిసి ఆదివారం హాస్టల్ ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. కింగ్ కోటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగారు. వైద్యుల ప్రకారం, విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉంది. వారికి మెరుగైన వైద్యం అందించాలని కమిషన్ సూచించింది.

త‌రువాత‌ అధికారుల బృందం హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆహార నాణ్యత, వంటగది నిర్వహణ, పారిశుద్ధ్యం, భద్రతా ప్రమాణాలను పరిశీలించింది. విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడిన వందనా గౌడ్, నాణ్యత ప్రమాణాల్లో రాజీ పడవద్దని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే, పిల్లల భద్రత విషయంలో కమిషన్ సీరియస్‌గా ఉన్నందున, యాజమాన్యం అన్ని విధానాలను కచ్చితంగా పాటించాలన్నారు.

Leave a Reply