పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలు

  • వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికలు సాఫీగా, సజావుగా నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అలజడులు, అల్లర్లు, అవరోధాలు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో, రెండవ విడత ఎన్నికలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నెల 14వ తేదీన వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల పరిధిలో జరిగే రెండవ విడత ఎన్నికలకు గాను కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

పోలింగ్ జరిగే ప్రాంతాల్లో శాంతిభద్రతల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో బి.ఎన్.ఎస్ (సీఆర్‌పీసీ) సెక్షన్ 163 (144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ నిషేధాజ్ఞల ప్రకారం ఐదుగురికి మించిన గుంపులుగా ప్రజలు చేరడం నిషేధించబడిందని తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు 14వ తేదీ రాత్రి 8 గంటల వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.

నిషేధాజ్ఞలను అతిక్రమించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలంతా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.

అలాగే ఓట్ల లెక్కింపు సమయంలో కూడా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎన్నికల విధులకు ఆటంకాలు కలిగించినా, అల్లర్లు సృష్టించినా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు.

Leave a Reply