జనావాసాల మధ్య గ్యాస్ గోదాం వద్దు.. : తలసాని

సనత్ నగర్, ఆంధ్రప్రభ : జనావాసాల మధ్య నిర్మిస్తున్న గ్యాస్ గోదాం పనులను వెంటనే నిలిపివేయాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సనత్ నగర్‌లోని అల్లా ఉద్దిన్ కోటి ప్రాంతంలో ఇండ్లకు ఆనుకుని భారత్ గ్యాస్ గోదాం నిర్మిస్తున్నారని స్థానికులు ఇటీవల ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి అల్లా ఉద్దిన్ కోటి ప్రాంతంలో పర్యటించి నిర్మాణం జరుగుతున్న స్థలాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ… నిరుపేదలు నివసించే ప్రాంతంలో, ఇండ్ల మధ్యలో గ్యాస్ గోదాం నిర్మాణానికి ఎలా అనుమతులు ఇచ్చారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నివాస గృహాల మధ్య గ్యాస్ గోదాం ఉంటే భవిష్యత్‌లో అనుకోని ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికే అమీర్‌పేటలోని రేణుక నగర్‌లో గ్యాస్ గోదాం కారణంగా స్థానికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. అల్లా ఉద్దిన్ కోటి ప్రాంతంలో గోదాం నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని, నిర్మాణ పనులను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు.

లేనిపక్షంలో స్థానికుల నుండి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఇక్కడ గ్యాస్ గోదాం ఏర్పాటు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు.

పర్యటనలో డీసీ శ్రీనివాస్, హైడ్రా అధికారి మోహన్‌రావు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సురేష్, ఏఈ జమీర్, సివిల్ సప్లై అధికారి జ్యోతి, సనత్ నగర్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్‌రెడ్డి, నాయకులు ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఖలీల్, కరీంలాలా, ఫాజిల్, రాజేష్ ముదిరాజ్, అష్రాఫ్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

కమిషనర్‌తో మాట్లాడిన తలసాని

సనత్ నగర్‌లోని అల్లా ఉద్దిన్ కోటి ప్రాంతంలో జనావాసాల మధ్య గ్యాస్ గోదాం నిర్మాణానికి జీహెచ్ఎంసీ ఇచ్చిన అన్ని అనుమతులను వెంటనే రద్దు చేయాలని, జరుగుతున్న పనులను నిలిపివేయాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్‌ను కోరారు.

గ్యాస్ గోదాం ప్రాంతాన్ని పరిశీలించిన వెంటనే అక్కడి నుంచే కమిషనర్‌కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. అనుమతులను తక్షణమే రద్దు చేయాలని కమిషనర్‌తో పాటు సంబంధిత శాఖలకు లేఖలను అందజేశారు. తలసాని ఆదేశాల మేరకు గ్యాస్ గోదాం నిర్మాణ పనులను నిలిపివేయాలని అధికారులు నిర్వాహకులకు ఆదేశించారు.

Leave a Reply