MPDO office | విజయవంతంగా ప్రజాదర్బార్

MPDO office | విజయవంతంగా ప్రజాదర్బార్

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

MPDO office | నాగాయలంక, ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ (Budda Prasad) తెలిపారు. బుధవారం నాగాయలంక ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల ప్రజలు తమ వ్యక్తిగత, గ్రామ సమస్యలపై మొత్తం 22 అర్జీలు సమర్పించారు. వాటిని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో చర్చించి పరిష్కారాలు సూచించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజలకు అత్యంత చేరువలో ప్రభుత్వ అధికారుల సేవలు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. అర్జీదారుల సమస్యలకు వేగవంతమైన పరిష్కారాలు అందించటమే ధ్యేయంగా ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోందన్నారు. మండల అధికారులు, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు (VRO) సమస్యలు తమ దృష్టిలోకి వచ్చినపుడే సాధ్యమైనంత మేరకు సత్వర పరిష్కారాలు చూపాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కేఎం.చంద్రశేఖర్, తహసీల్దార్ సీహెచ్ వీరాంజనేయ ప్రసాద్, ఆర్అండ్‌బీ శాఖ డీఈఈ ఎం.రమేష్, ఇరిగేషన్ శాఖ డీఈఈ బీబీఎస్ గణపతి, ఏఈఈలు, పంచాయతీ కార్యదర్శులు, నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Leave a Reply