Minister | తీవ్ర వాదుల చెర నుంచి.. మా బిడ్డలను రక్షించండి..
- కిడ్నాపైన కొడుకులు.. 15 రోజులైనా జాడ లేదు..
- కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి.. విముక్తి కల్పించండి..
- కేంద్ర మంత్రి బండికి ప్రవీణ్, రామచంద్ర కుటుంబాల మొర
- సానుకూలంగా స్పందించి.. విదేశాంగ శాఖ దృష్టికి..
Minister | కరీంనగర్, ఆంధ్రప్రభ : పొట్ట చేతపట్టుకుని బతుకు దెరువు కోసం మాలి దేశంలో పని చేస్తున్న నల్లమాసు ప్రవీణ్ రెడ్డి, కుమారాకుల రామచంద్రలను కిడ్నాప్ చేసిన తీవ్ర వాదుల చెర నుండి విముక్తి కల్పించేలా చొరవ తీసుకోవాలని బాధితుల కుటుంబ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Minister Bandi Sanjay Kumar)ను వేడుకున్నారు.
ప్రవీణ్ రెడ్డి తండ్రి జంగయ్యతోపాటు రామచంద్ర సహోద్యోగులు, స్నేహితులు ఈ రోజు కరీంనగర్లో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బండ సోమారం గ్రామానికి చెందిన ప్రవీణ్, ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన రామచంద్ర మాలి దేశంలో రూబీ కంపెనీలో ఏడాది కాలంగా ఉద్యోగం చేస్తున్నారని, వారిని గత నెల 23న మాలి దేశంలోని జెఎస్ఐఎం(JSIM) అనే తీవ్రవాద సంస్థ సభ్యులు కిడ్నాప్ చేశారని వాపోయారు.
ఇప్పటి వరకు వారిద్దరి ఆచూకీ లేదని, పక్షం రోజులు దాటినా ఆ దేశ ప్రభుత్వం తమకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. తామంతా కూలీ పని చేసుకుంటూ పొలం పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నామని, తమ బిడ్డలను కిడ్నా ప్(kidnapping) ఎందుకు చేశారో కూడా తమకు తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
మాలి దేశ ప్రభుత్వంతో మాట్లాడి వారిద్దరిని కిడ్నాపర్ల చెర నుండి రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి బండి వెంటనే భారత విదేశాంగ శాఖ మంత్రిత్వ కార్యాలయ(ministry office) అధికారులతో మాట్లాడారు.
మాలి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి కిడ్నాపర్ల చెర నుండి తెలంగాణ వాసులను రక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ప్రవీణ్, రామచంద్రలను కిడ్నాపర్ల చెర నుండి విడిపించేందుకు మాలి దేశంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

