పకడ్బందీగా నాకాబందీ ‘ఆపరేషన్ కవచ్’
- అర్ధరాత్రి క్షేత్రస్థాయిలో సీపీ వీసీ సజ్జనర్ ఆకస్మిక పర్యటన
- టీజీఐసీసీసీ నుంచి చెక్ పాయింట్ల వద్ద పరిస్థితి పరిశీలన
ఖైరతాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ లో శాంతి భద్రతలే లక్ష్యంగా నగర పోలీసులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాకాబందీ ‘ఆపరేషన్ కవచ్’ విజయవంతంగా ముగిసింది. శుక్రవారం రాత్రి 5 వేల మంది పోలీసులతో, 150 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించడం జరిగింది. రాత్రి 10:30 గంటల నుంచి ఒంటి గంట వరకు ఆపరేషన్ కవచ్ కొనసాగింది.
కేవలం ఆదేశాలకే పరిమితం కాకుండా నగర సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ స్వయంగా రంగంలోకి దిగారు. సౌత్ వెస్ట్ జోన్‌లోని టోలీచౌకి, పాతబస్తీ గుల్జార్‌హౌస్ తదితర సమస్యాత్మక, కీలక ప్రాంతాల్లో పర్యటించి తనిఖీలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. సిబ్బందికి తగు సూచనలు చేశారు.
అనంతరం బంజారాహిల్స్‌లోని ‘తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’ (TGICCC)కు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి నగరవ్యాప్తంగా జరుగుతున్న తనిఖీలను సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. జాయింట్ సీపీ (లా అండ్ ఆర్డర్) తఫ్సీర్ ఇక్బాల్, ఇతర ఎస్‌హెచ్‌ఓలతో మాట్లాడి ఆపరేషన్ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు.
లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్, ట్రాఫిక్, ఆర్మ్‌డ్ రిజర్వ్ బలగాల సమన్వయంతో ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు, సరైన పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేశారు.
దాదాపు 15 వేల వాహనాలను తనిఖీ చేసి.. వాటిలో 1600 వెహికిల్స్ ని సీజ్ చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా తుకారం గేట్ పరిధిలో అర కిలో గంజాయని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 105 పెట్టి కేసులను నమోదు చేశారు.
ఈ ఆపరేషన్‌లో సిబ్బంది కనబరిచిన వృత్తి నిబద్ధతను సీపీ సజ్జనర్ అభినందించారు. హైదరాబాద్ నగరాన్ని నేర రహితంగా తీర్చిదిద్దడం, ప్రజల్లో భద్రతా భావాన్ని మరింత పెంపొందించడం కోసమే ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో ఈ మెగా డ్రైవ్‌ను చేపట్టామని వివరించారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు, సరైన పత్రాలు లేకుండా తిరిగే వారు ఇకపై కఠిన చర్యలు ఎదుర్కోక తప్పదని, శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఈ ఆపరేషన్ ఒక్క రోజుతో ఆగిపోదని భవిష్యత్తులోనూ ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. అర్ధరాత్రి వేళ అంకితభావంతో విధులు నిర్వహించిన 5 వేల మంది పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.



