School | ప్రతి విద్యార్థి కంప్యూటర్ విద్య నేర్చుకోవాలి

School | ప్రతి విద్యార్థి కంప్యూటర్ విద్య నేర్చుకోవాలి


పుస్తకాలతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ తరగతి గదిని ప్రారంభించిన
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ మాధవి దేవి
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్


School | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్‌ను, ప్రొజెక్టర్, డిజిటల్ తరగతి గదిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవి దేవి శనివారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, డీఈఓ రమేష్ కుమార్, దాతలు డాక్టర్ సునీల్ చౌదరి కాజా ఇతర పూర్వ విద్యార్థులతో కలిసి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవిదేవి తంగిరాల జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవి దేవి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… విద్యార్థులు పుస్తకాలతో పాటు ఈ తరానికి డిజిటల్ నెపుణ్యం అత్యంత కీలకమ‌న్నారు. టెక్నాలజీ నేర్చుకున్న విద్యార్థులు భవిష్యత్తులో ఏ రంగంలోనైనా ముందంజలో ఉంటారు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా ప్రపంచ స్థాయి అవకాశాలు అందుకోవాలన్నారు. మీరు పొందుతున్న ఈ సౌకర్యాలను సమర్థంగా వినియోగించి, మీ కృషితో కుటుంబం, సమాజం, దేశానికి గౌరవం తీసుకురావాలని ఆమె ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

విద్యార్థులు చదువుతో పాటు క్రీడ ఇతర రంగాల్లో రాణించేలా, విద్యార్థుల్లో డిజిటల్ లిటరసీ పెంపున‌కు ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని ఆమె సూచించారు. ఇతర దేశంలో ఉంటూ మాతృదేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే అమెరికాలో స్థిరపడి తెలుగు డాక్టర్స్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందించ తగ్గ విషయమని ఆమె విద్యార్థులు కోసం ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ… విద్యార్థులకు మెరుగైన డిజిటల్ విద్యను అందించేందుకు దాతలు ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ డిజిటల్ తరగతులను విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా వినియోగించుకుని, మరింత ఆధునిక కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో రాణించాలంటే ప్రధానంగా చదువు ఒకటే మార్గమని, విద్యార్థులు చదువుతో ఇతర రంగాల్లో రాణించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులకు మార్గదర్శకమౌతూ విద్యార్థుల భవిష్యత్తుకు ప్రణాళికల రూపొందించాలని కలెక్టర్ సూచించారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో సృజనాత్మకత నైపుణ్యాలను అభివృద్ధి చెందే విధంగా కంప్యూటర్లు వినియోగంతో పాటు ఇతర అంశాల వారీగా దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ కోరారు. విద్యార్థులు భవిష్యత్తులో రాణించాలంటే విద్య ప్రధాన కీలకమని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు.

హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ…. తాను ఈ పాఠశాలలో 1975 లో 10వ తరగతి విద్యార్థిగా చదువుకుని నేడు ఈ స్థానంలోకి వచ్చానంటే అందుకు ఆనాటి గురువులు తమకు నేర్పిన విద్య ప్రధాన కారణమని విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదువుకొని, దేశభక్తితో పాటు దైవభక్తితో రాణించి మాతృభూమికి కృషి చేసేలా ప్రతి విద్యార్థి ఏదో ఒక రంగంలో రాణించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా సూచించారు.

పూర్వపు విద్యార్థులు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నట్లు సుధాకర్ గౌడ్ ఈ సందర్భంగా ప్రకటించారు. అంతకుముందు… ఎన్సీసీ విద్యార్థులు ముఖ్య అతిథులకు స్వాగతం పలికారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అతిధులకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ మాధవి దేవి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ముఖ్య అతిథులను శాలువాలతో ఉపాధ్యాయులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లత, పూర్వపు విద్యార్థులు అర్థం రవి, సుధాకర్ గౌడ్, నర్సింగారెడ్డి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply