Rs. 347 crore | జోగులాంబ దేవాలయ అభివృద్ధికి ప్రణాళిక
తక్షణ పనులకు రూ. 35 కోట్లు అవసరం
ఆలయ సమీక్షలో పాల్గొన్న చిన్నారెడ్డి, శైలజా రామయ్యర్, స్తపతి గోవింద హరి
Rs. 347 crore | గద్వాల (ప్రతినిధి), ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లా తుంగభద్ర నది ఒడ్డున ఆలంపూర్ వద్ద కొలువైన 5వ శక్తి పీఠం జోగులాంబ అమ్మ వారి ఆలయ అభివృద్ధికి రూ.347 కోట్లతో(Rs. 347 crore) ప్రణాళికను సిద్ధం చేశారు. తక్షణం బాలాలయం, వజ్ర లేపనం, కుంబాభిషేకం వంటి పనులు ప్రారంభించేందుకు రూ. 35 కోట్లు అవసరం అని నిర్ణయం తీసుకున్నారు.
ఈ రోజు సచివాలయంలో రాష్ట్ర ప్రణాళికా(State Planning) సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, స్తపతి గోవింద హరి, ఆలయ అభివృద్ధి రూపశిల్పి సూర్యనారాయణ మూర్తి జోగులాంబ(Zogulamba) ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.
త్వరలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కావాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జోగులాంబ ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డికి ఉందని, ఈ ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం సకల సౌకర్యాలు కల్పించాలన్న తపన సీఎం కు ఉందని చిన్నారెడ్డి తెలిపారు. రూ. 347 కోట్ల ప్రణాళికలో మొదటి దశలో రూ. 138.40 కోట్లు, రెండవ దశలో రూ. 117.60 కోట్లు, మూడవ దశలో రూ. 91 కోట్లు అవసరం అని సమావేశంలో నిర్ణయానికి వచ్చారు.


