Breaking : తీన్మార్ మల్లన్న అరెస్ట్
Breaking : హైదరాబాద్, ఆంధ్రప్రభ : గాంధీ ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్న బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నల (MLC Teenmar Mallanna) ను పోలీసులు అరెస్ట్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర చారికి మద్దతు గా వందలాదిమంది సంఘాల కార్యకర్తలు ఉదయం నుండి గాంధీ ఆస్పత్రి వద్ద ఆందోళన చేస్తున్నారు.
సాయిఈశ్వర (Sai Easwara) మరణ వార్త తెలుసుకొని ఆందోళన ఉధృతం చేస్తూ గాంధీ ఆసుపత్రి వద్దకు వచ్చిన వందలాది మంది బీసీ సంఘాల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ బృందాన్ని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… సాయి ఈశ్వర చారి మృతికి కాంగ్రెస్, బీజేపీలే కారణమన్నారు. 42శాతం రిజర్వేషన్లు అన్యాయం చేసినందుకే సాయి ఈశ్వర చారి ఆత్మహత్య (suicide) చేసుకున్నారన్నారు. ఇది ముమ్మాటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన హత్యనే అన్నారు.

రేవంత్ రెడ్డి (Revanth Reddy), కిషన్ రెడ్డిలే ఈ హత్యకు బాధ్యత వహించాలన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేయాలన్నారు. సాయి ఈశ్వర్ మృతి తోనైనా కేంద్రం, రాష్ట్రం దిగి రావాలన్నారు. సాయిఈశ్వర్ మృతి పై పార్లమెంట్లో చర్చ జరగాలన్నారు. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదించాలన్నారు.
తక్షణమే సర్పంచ్ ఎన్నికలు నిలిపివేయాలన్నారు. బీసీ ద్రోహుల పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల నాయకుల ఇండ్లను ముట్టడించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలలో ఉన్న బీసీ నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. సాయి ఈశ్వర కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలను విడుదల చేయాలన్నారు. వందలాది మంది బీసీ ఉద్యమకారులను హైదరాబాద్ నగరంలో బొల్లారం, తిరుమలగిరి, అంబర్పేట, ఉప్పల్ పోలీస్ స్టేషనులకు తరలించారు. సాయి ఈశ్వర చారి మృతిపై అఖిలపక్ష పార్టీల వైఖరి ప్రకటించాలని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ నుండి జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

