- మెగా పేరెంట్ టీచర్ మీటింగ్….
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల మహాసమావేశం జరుగుతోంది. విద్యార్థుల చదువు, అభివృద్ధి, ప్రగతిపై తల్లిదండ్రులతో ప్రత్యక్షంగా చర్చించాలని ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశించడంతో జిల్లావ్యాప్తంగా పాఠశాలలు పూర్తిగా పండుగ వాతావరణంలో ముస్తాబయ్యాయి.
ఈ సమావేశం నిర్వహణకు ప్రభుత్వం ప్రతి పాఠశాలకు విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.900 నుండి రూ.9,000 వరకు నిధులు జమ చేసింది. చిత్తూరు జిల్లాలోని మొత్తం 2,460 పాఠశాలలకు మొత్తం రూ.47,54,250 నేరుగా పాఠశాల ఖాతాలకు చేరాయి. కార్యక్రమ నిర్వహణకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రత్యేక అధికారుల బృందాలను నియమించారు.
జిల్లా ఇన్చార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు శాసనసభ్యుడు గురజాల జగన్మోహన్ గుడిపాల మండలంలో జరిగే మహాసమావేశంలో పాల్గొననున్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, దాతలు, ప్రజా ప్రతినిధులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు.
ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రగతి పత్రాలు తల్లిదండ్రులకు అందించి, చదువులో వచ్చిన మార్పులు, అభ్యసన స్థాయిని వివరించనున్నారు. ప్రభుత్వం కొత్తగా అందించిన పరీక్షా పుస్తకాల్లో విద్యార్థులు రాసిన నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక పరీక్షలను తల్లిదండ్రులకు చూపించి వివరంగా చర్చిస్తారు. విద్యార్థుల ఫలితాలను తల్లిదండ్రులు తమ మొబైల్‌లో చూడగలిగే విధానాన్ని కూడా వివరించి చూపిస్తారు.
విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, బాలికల శక్తివంతీకరణ, విలువల విద్యపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చూపే చిత్రాలను ప్రతి పాఠశాలలో ప్రదర్శిస్తారు. నూతన ఆట వస్తువులు, గ్రంథాలయ పుస్తకాలు, కథాపెట్టె సామగ్రి, ప్రాథమిక పఠన–లేఖన సాధనాలు, ప్రయోగశాల వస్తువులు అన్ని పాఠశాలలో ప్రదర్శనగా ఉంచి తల్లిదండ్రులు పరిశీలించే వీలు కల్పిస్తారు.
పాఠశాల ప్రగతిపై ప్రధానోపాధ్యాయులు నివేదిక ఇవ్వనున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా బాలికలకు అందిస్తున్న ఆత్మరక్షణ శిక్షణలో భాగంగా బాలికలు కరాటే ప్రదర్శన చేస్తారు. విలువల విద్య పుస్తకాల ద్వారా నేర్చుకున్న అంశాలను విద్యార్థులు తల్లిదండ్రుల ముందు వివరిస్తారు.
పదో తరగతి విద్యార్థుల పరీక్షా సిద్ధత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న “వంద రోజుల కార్యక్రమం” వివరాలను ఉపాధ్యాయులు వివరించనున్నారు. పాఠశాల కమిటీ సభ్యులు, అతిథులు, దాతలు కలిసి పాఠశాల అభివృద్ధికి చేపట్టవలసిన కార్యక్రమాలపై చర్చిస్తారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంను అందరూ కలిసి స్వీకరించిన తరువాత సమావేశం ముగుస్తుంది.
జిల్లా విద్యాధికారి బి.వరలక్ష్మి, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త మద్దిపట్ల వెంకటరమణ సంయుక్తంగా మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం అత్యంత కీలకమని, ప్రతి తల్లిదండ్రుడు తప్పకుండా సమావేశానికి హాజరై తమ సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

