తంగళ్ళపల్లి ఫిబ్రవరి 24 (ఆంధ్రప్రభ) – ఆర్టీసీ బస్సు ఢీకొని టెన్త్ విద్యార్థి మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన నిశాంత్ (15) అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చుదువుతున్నాడు. నిశాంత్ రామన్నపల్లి గ్రామంలో ఉన్న తండ్రి భూమయ్య ను తీసుకురావడానికి వెళ్తూ అంకిరెడ్డిపల్లి రోడ్డు నుండి రామన్నపల్లి వెళ్ళే క్రమంలో రోడ్డు దాటుతుండగా సిరిసిల్ల నుండి సిద్దిపేట వైపు వెళ్తున్న టి.ఎస్21జెడ్0112 నెంబర్ గల ఆర్టిసి బస్ డీ కొనడంతో బాలునికి తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
అదే బైక్ పై ఉన్న తన స్నేహితుడు ప్రమాదాన్ని గ్రహించి బైక్ పై నుండి దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏది ఏమైనా కొద్ది రోజులలో పబ్లిక్ ఎగ్జామ్ రాసే నిశాంత్ తిరిగిరాని లోకాలకు వెళ్ళాడని తెలియగానే బంధువుల రోదనలు మిన్నంటాయి. నిశాంత్ ఒక్కడే సంతానం అవడంతో తల్లి దండ్రులను ఓదార్చడంలో ప్రతి ఒక్కరు విఫలమవుతున్నారు. అయిన పోలీస్ శాఖ ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని చెప్పినా తల్లి దండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వడం మానడం లేదు. ఫలితంగా కడుపుకోత అనుభవిస్తున్నారు.