తలస్సేమియా వ్యాధిగ్రస్తులకు అమ్మలాంటి సంస్థ రెడ్‌క్రాస్..

- పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంస్థ ఇది..
- రెడ్‌క్రాస్ సేవలను విస్తృతం చేసేందుకు సమష్టి కృషి..
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ..
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : తలస్సేమియా వ్యాధిగ్రస్తులకు అమ్మలాంటి సంస్థ రెడ్‌క్రాస్ అని.. ఈ సంస్థ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ అన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఎన్టీఆర్ జిల్లా) ఆధ్వర్యంలో శనివారం విజయవాడ, గాంధీనగర్‌లోని రోటరీ రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకులో తలస్సేమియా వ్యాధిగ్రస్తులకు రక్తమార్పిడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ఐఆర్సీఎస్ ఎన్టీఆర్ జిల్లా ఛైర్మన్ డా. సమరం తదితరులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ… ఇది ఒక మంచి కార్యక్రమమని.. తలస్సేమియా వ్యాధిగ్రస్తులకు రెడ్‌క్రాస్ నిస్వార్థంగా సేవలందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో తలస్సేమియా వ్యాధిగ్రస్తులు దాదాపు రెండు వేల నుంచి మూడు వేల వరకు ఉన్నట్లు పేర్కొన్నారు.
తలస్సేమియా వ్యాధిగ్రస్తులకు ఉన్నతమైన ఆరోగ్య జీవితాన్ని అందించేందుకు రెడ్‌క్రాస్ కృషిచేస్తోందన్నారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలను కూడా అందించేందుకు సంస్థ కృషిచేస్తోందని తెలిపారు. రెడ్‌క్రాస్ బృందంతో పాటు వైద్య నిపుణులు చూపుతున్న చొరవ వెలకట్టలేనిదని.. రాష్ట్ర గవర్నర్ దార్శనికతకు అనుగుణంగా సమష్టి కృషితో రెడ్‌క్రాస్ సేవలను విస్తృతం చేసేందుకు కృషిచేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
రెడ్‌క్రాస్ జిల్లా శాఖ బ్లడ్ బ్యాంకు అందిస్తున్న సేవలతో పాటు ఈ బ్లడ్ బ్యాంకు సేవల విస్తృతి గురించి డా. సమరం వివరించారు. తలస్సేమియా వ్యాధిగ్రస్తులకు రక్తమార్పిడితో పాటు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి కూడా వైద్య నిపుణులు వివరించారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఎన్టీఆర్ జిల్లా) వైస్ ఛైర్మన్ డా. వి.జోషి, కార్యదర్శి ఇ.చిట్టిబాబు, మెడికల్ ఆఫీసర్ డా. మదన్, హెమటాలజిస్టు (హెచ్‌సీజీ) హాస్పిటల్ డా. అమర్నాథ్, ఎంసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
