Paddy : దళారులను నమ్మొద్దు

Paddy : దళారులను నమ్మొద్దు
- కనీస మద్దతు ధరకే అమ్మండి
- ఆర్డీకేలను సద్వినియోగం చేసుకోండి
- గోనె సంచుల కొరత లేదు
- పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

(ఆంధ్రప్రభ, విజయవాడ రూరల్)
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని.. ఖరీఫ్ సీజన్ (2025–26) లో అత్యంత పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ రూరల్ నిడమానూరు, ఎనికేపాడు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి.. రైతులతో మాట్లాడారు. ధాన్యాన్ని విక్రయించడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అడిగి తెలుసుకున్నారు. ఎనికేపాడులోని వీరయ్య రైస్ మిల్లును తనిఖీ చేసి కార్యకలాపాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రైతులు మద్దతు ధరకు రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయించుకోవాలని.. దళారులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పేర్కొన్నారు. జిల్లాలో 150 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని.. ఎక్కడా గోనె సంచుల కొరత అనే మాట రాకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ప్రస్తుతం జిల్లాలో మొత్తం 13,70,700 గోనె సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. గత ఖరీఫ్ 2024–25 సీజన్లో నవంబరు వరకు మొత్తం 11,806.720 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా ప్రస్తుత ఖరీఫ్ 2025–26 సీజన్లో ఇప్పటివరకు దాదాపు 29 వేల టన్నుల ప్యాడీ కొనుగోలును పూర్తిచేసినట్లు తెలిపారు.
ప్రస్తుత ఖరీఫ్ మెయిన్ సీజన్లో 1,450 వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఎప్పటికప్పుడు అధికారులు, సిబ్బందికి మార్గనిర్దేశనం చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. క్షేత్ర స్థాయి పర్యటనలో కలెక్టర్ వెంట విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య తదితరులు ఉన్నారు.
