Dried grain| రోడ్లపై ఆరబోసిన ధాన్యం కొనుగోలు

- మిల్లులకు తరలించిన అధికారులు
Dried grain| చల్లపల్లి, ఆంధ్రప్రభ : తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ కుమార్ ఆదేశాల మేరకు చల్లపల్లి తహసీల్దార్ డి.వనజాక్షి ఆధ్వర్యంలో అధికారులు రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించారు. తుఫాను వార్తలతో యంత్రాల ద్వారా గ్రామాల్లో ముమ్మరంగా వరికోతలు సాగుతున్నాయి. పంట కోత అనంతరం ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసుకుంటున్నారు. నెలాఖరుకు తుఫాను ప్రభావంతో వానలు కురిసే అవకాశం ఉందని తెలియడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
జేసీ ఆదేశాలతో రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని తేమశాతం పరిశీలించి ఆన్లైన్లో ట్రక్ షీట్ జనరేట్ చేయించి ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. చల్లపల్లి మండలం వెలివోలు, పుచ్చగడ్డ, వక్కలగడ్డ, లక్ష్మీపురం, మాజేరు గ్రామాల్లో తహసీల్దార్ డి.వనజాక్షి పర్యటించారు. రోడ్లపై అరబోసిన ధాన్యం పరిశీలించి రైతులతో మాట్లాడారు. 22, 23 తేమశాతం వరకు ఉన్న ధాన్యాన్ని ట్రాక్టర్లను, లారీలను పిలిపించి బస్తాలను లోడుచేయించి మిల్లులకు తరలించారు.
శుక్రవారం సుమారు నాలుగు వేల బస్తాలు కొనుగోలు చేసినట్లు తహసీల్దార్ వనజాక్షి తెలిపారు. ధాన్యం కొనుగోలు కోసం సిద్ధంగా ఉంచిన వాహనాలతోపాటు మిల్లర్ల సహాయంతో అదనంగా వాహనాలు రప్పించారు. తుపాను బారిన పడకుండా పంటను కాపాడేందుకు అధికారులే దగ్గరుండి ధాన్యం తరలింపు కార్యక్రమం చేపట్టారు. వీఆర్వోలు పరిశ కిరణకుమార్, ప్రతిమ, ముదునూరి అమలేశ్వరరావు, సీఈవోలు చక్రపాణి, నాగేశ్వరరావు, వెంకటేష్ లతో పాటు ఆయా గ్రామాల వీఆర్వోలు, సొసైటీ సీఈఓలు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం తరలింపులో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, గొనె సంచులు కావాలన్నా..వాహనాలు అవసరం అయినా 99086 64610 నంబర్లో సంప్రదించాల్సిందిగా వనజాక్షి సూచించారు.
