Srikakulam | ఇరుముడితో ఫ్లైట్ ఎక్కొచ్చు

Srikakulam | ఇరుముడితో ఫ్లైట్ ఎక్కొచ్చు
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
అయ్యప్ప భక్తులు హర్షం

Srikakulam | ( శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో) శబరిమల అయ్యప్ప స్వామి భక్తుల యాత్ర సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తులు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని (కొబ్బరికాయతో సహా) ఇప్పుడు చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లుకునే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పించారు..
ఇప్పటివరకు అమలులో ఉన్న భద్రతా నియమావళి ప్రకారం ఇరుముడిని తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజీగా పంపాల్సి రావడం వల్ల భక్తులు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు.. ఈ సమస్యపై తీవ్రంగా దృష్టి సారించిన రామ్మోహన్ నాయుడు.. భక్తుల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుని, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, సంబంధిత భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుని, అయ్యప్ప స్వామి భక్తుల కోసం ప్రత్యేక మినహాయింపు అమలు చేయాలని నిర్ణయించారు..
ఈ ప్రత్యేక సడలింపు ఈ రోజు నుంచే అమల్లోకి వస్తూ, మండల పూజల కాలం నుంచి మకర విలక్కు ముగిసే జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తుందని తెలిపారు. ఈ కాలంలో శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు, ఎయిర్‌పోర్టు భద్రతా తనిఖీలను పూర్తి చేసిన అనంతరం, తమ ఇరుముడిని చేతి సామానుగా విమాన క్యాబిన్‌లో తమతో పాటు తీసుకువెళ్ళవచ్చు.
అయితే భక్తులందరూ ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించి, సూచించిన మార్గదర్శకాలను సమయానికి పాటించాలనీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇరుముడి స్క్రీనింగ్, తనిఖీ ప్రక్రియల విషయంలో అధికారుల సూచనలను కచ్చితంగా అనుసరించాలనీ, శబరిమల యాత్ర పవిత్రతకు ఏమాత్రం భంగం కలగకుండా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.
అయ్యప్ప స్వామి భక్తుల దీక్ష, భక్తి, ఆచార వ్యవహారాల పట్ల గౌరవంతో తీసుకున్న ఈ నిర్ణయం, దేశంలోని అన్ని దక్షిణాది రాష్ట్రాల నుంచి, అలాగే ఇతర ప్రాంతాల నుంచి విమాన మార్గం ద్వారా శబరిమల చేరే భక్తులకు ప్రయాణ సౌలభ్యం కల్పిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తులందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో శాంతి, ఆరోగ్యం, సుఖసమృద్ధులు కలగాలని ఆకాంక్షించారు.
