Fog | మంచుదుప్పటి..!
- Fog | కొమురంభీం జిల్లాలో కమ్మేసిన పొగమంచు
Fog | ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : శీతల గాలులు, దట్టమైన పొగ మంచుతో ఆదిలాబాద్(Adilabad) ఉమ్మడి జిల్లా వణికి పోతోంది. ఉట్నూర్ ఏజెన్సీ తో పాటు కొమరంభీం జిల్లాలోని కౌటాల దహేగాం కాగజ్నగర్, తిర్యాణి, వాంకిడి, జై నూర్ మండలాల్లో ఈ రోజు తెల్లవారు జామున నుంచి దట్టమైన పొగ మంచు ఆవహించింది.
నిన్న, మొన్నటి వరకు తుఫాను ప్రభావంగా సాధారణ ఉష్ణోగ్రతలు 10 నుండి 14 డిగ్రీల(10 to 14 degrees) కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఈ రోజు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గి చలిగాలుల ప్రభావం పెరిగింది.
బెంబేలెత్తిపోతున్న ప్రజలు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్తరాది నుండి ఇస్తున్న చలిగాలుల ప్రభావానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉట్నూర్, కొమరం భీం ఏజెన్సీ మంచు దుప్పటి కప్పుకొని పొగ మంచు ఆవహించడంతో రోడ్లపై బయటకు వెళ్లే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 9 గంటల వరకు మంచు కమ్మేయడంతో చీకటి వాతావరణం నెలకొంది.
ప్రధాన రహదారుల్లో వాహన చోదకులు లైట్లు వేసి వాహనాలు నడపాల్సిన పరిస్థితి నెలకొంది. చలి గాలుల(windy)కు జనజీవనం స్తంభించింది. ఉదయం పూట పల్లెల నుండి పట్టణాలకు వెళ్లే సాధారణ రైతు కూలీలు, పాలు, కూరగాయలు అమ్మే రైతులు చలిగాలులకు ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకూ శీతల గాలులతోపాటు అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఇంటి గడప దాటి బయటకు వెళ్లలేని పరిస్థితి. బస్టాండ్, రైల్వే స్టేషన్ల(bus stand, railway stations)లో యాచకులు చలి తీవ్రతకు దుర్భర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది.
సిర్పూర్ – యు మన్యంలో 7.4 డిగ్రీల రికార్డు..!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ రోజు రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లా సిర్పూర్ యు లో అత్యల్పంగా 7.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, తిర్యాణి మండలం గిన్నిదరిలో 8.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా పోచ్చెరలో 9.0, తిర్యాణీలో 9.5, సత్నాల, సోనాలలో 9.6, కెరమెరిలో 9.7, భీంపూర్, ఆదిలాబాద్ రూరల్, నేరడికొండలో 9.7, మావలలో 9.8, ఆదిలాబాద్ అర్బన్ లో పది డిగ్రీల ఉష్ణోగ్రత(ten degrees temperature) నమోదయింది. ఉమ్మడి అదిలాబాద్ నాలుగైదు మండలాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు, కోల్డ్ వేవ్స్ వాతావరణం ఇబ్బందులకు గురిచేస్తుంది.
శీతల గాలుల తో అలర్ట్!

ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఏజెన్సీలో మంచు తెరలతో వాతావరణం మబ్బులు కొమ్ముకోవడం , చలిగాలుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం తొమ్మిది గంటల తర్వాతే బయటకు వెళ్లాలని, రాత్రి వేళల్లో ఉన్ని వస్త్రాలు, రగ్గులు అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
చర్మవ్యాధులతోపాటు ఉబ్బసం, చలి జ్వరం, శ్వాస కోశ సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయని డాక్టర్లు(doctors) పేర్కొంటున్నారు. పిల్లలు , వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. బస్సుల్లో ప్రయాణించేవారు తప్పనిసరిగా స్వెటర్లు ఉన్ని వస్త్రాలు ధరించాలని సూచిస్తున్నారు.


