Ongole | కథ అడ్డం తిప్పిన రాపిడ్ రైడ్..

- రైలులో దోపిడీ చేసిన దొంగ అరెస్ట్
- రూ. 48.50 లక్షల విలువగల బంగారం రికవరీ
- సీసీ ఫుటేజీల ఆధారంగా వేట
- వివరాలు వెల్లడించిన రైల్వే డిఎస్పి మురళీధర్
ఒంగోలు క్రైం, ఆంధ్రప్రభ : రైళ్లలో దోపిడీలు చేయడంలో చేయి తిరిగిన దొంగ… పక్కా ప్రణాళికతో చేతివాటం ప్రదర్శించాడు. అదృష్టం కలిసి వచ్చింది ఏకంగా 48.50 లక్షల విలువ కలిగిన బంగారు ఆభరణాల బ్యాగ్ అతని వశం అయింది. అయితేనేం పాపం దురదృష్టం మాత్రం రాపిడ్ రైట్ రూపంలో వెంటాడింది.
సిసి కెమెరాల ఫుటేజీల ఆధారంగా వేట సాగించిన జి.ఆర్.పి పోలీసులు ఎట్టకేలకు నిందితున్ని పట్టుకున్నారు. అతని వద్ద నుండి సుమారు రూ.48.50 లక్షల విలువ గలిగిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఒంగోలు రైల్వే పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశంలో రైల్వే నెల్లూరు సబ్ డివిజన్ డిఎస్పి జి మురళీధర్ సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. చార్మినార్ ఎక్స్ప్రెస్ లో ఈ నెల 13న జరిగిన దోపిడీ కేసులో తెలంగాణ రాష్ట్రం, బాలాపూర్, కొత్తపేట, న్యూ గ్రీన్ సిటీకి చెందిన మహమ్మద్ షాకిల్ అహ్మద్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
అతని వద్దనుండి దొంగిలించబడినటువంటి డైమండ్, బంగారు ఆభరణాలు, అత్యంత ఖరీదైన చేతి గడియారాలు, 40 వేల రూపాయల40 వేల రూపాయల రూ. 48.50 లక్షల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.
సీసీ ఫుటేజీల ఆధారంగా కదిలిన విచారణ
బాధితుడు కొలికి కోదండరామిరెడ్డి ఫిర్యాదు ఆధారంగా ఈనెల 24న ఘటనకు సంబంధించి ఒంగోలు జిఆర్పి పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ రైల్వే ఎస్పి దేవ్ సింగ్ అది సెల్ తో డి.ఎస్.పి మురళీకృష్ణ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నెల్లూరు రైల్వే ఇన్స్పెక్టర్ ఏ సుధాకర్, ఒంగోలు రైల్వే ఇన్స్పెక్టర్ షేక్ మౌలా షరీఫ్, ఒంగోలు సర్కిల్ క్రైమ్ టీం సబ్ ఇన్స్పెక్టర్ కొండయ్య, సబ్ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బమ్మ తమ బృంద సభ్యులతో విచారణను వేగవంతం చేశారు.
హైదరాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిందితుడి ఆచూకీ గుర్తించిన పోలీసులు అతను ప్రయాణించిన రాపిడ్ రైడ్ బైకు ను గుర్తించారు. దాని ఆధారంగా అనుమానితుడి అడ్రస్ ను సాధించారు. తీగ లాగితే డొంక కదిలిన చందంగా అనుమానితుడి నేరాలు చిట్టా పోలీసుల చేతుల్లోకి వచ్చి పడింది.
అప్పటికే నిందితుడి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాలతో విజయవాడలో బంగారం విక్రయిస్తున్న నిందితుడు మహమ్మద్ షకిల్ అహ్మద్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించి తమదైన శైలిలో విచారించారు. విచారణలో దొంగతనానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని డి.ఎస్.పి మురళీధర్ అభినందించారు.
