MP | తాగునీరు, సైన్‌బోర్డులు అందుబాటులో ఉంచాలి

MP | తాగునీరు, సైన్‌బోర్డులు అందుబాటులో ఉంచాలి
శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు సమీక్షించిన ఎంపీ గురుమూర్తి
MP | తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్‌లో రూ.50 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి (Development) పనులను తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి గురువారం పరిశీలించారు. స్టేషన్‌లో మొదటి దశలో జరుగుతున్న పనుల పురోగతిని ఆయన తనిఖీ చేశారు. పాత ఎల్‌సీ గేట్ నెం. 28 వద్ద అండర్‌పాస్ మూసివేయడంతో అక్కడ అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా, వారి అభ్యర్థనను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. స్టేషన్‌లో తాగునీటి వసతి, సైన్‌బోర్డులు, ఇతర మౌలిక వసతులపై ఎంపీ ప్రత్యేకంగా ఆరా తీశారు. తాగునీరు సక్రమంగా అందుబాటులో ఉండేలా చూడాలని, స్టేషన్‌లో సైన్‌బోర్డులు సరిగా లేవని గమనించి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
శ్రీకాళహస్తి ఆలయ ఈఓతో మాట్లాడిన ఎంపీ, రైల్వే స్టేషన్‌లో ఉన్న సమాచార కేంద్రంలో భక్తులకు 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఆలయ సేవలకు సంబంధించిన వివరాలను రైల్వే స్టేషన్ ఆవరణలో ఒక డిజిటల్ బోర్డు (Digital board) ద్వారా ప్రదర్శించేలా వెంటనే ఏర్పాట్లు చేయాలని సూచించారు. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ ద్వారా గతంలో నడుస్తున్న గుంటూరు–తిరుపతి ప్యాసింజర్, గూడూరు–తిరుపతి ప్యాసింజర్, చెన్నై–రేణిగుంట–నెల్లూరు మెమూ ప్యాసింజర్ వంటి రైళ్లు కోవిడ్ అనంతరం నిలిపివేశారని స్థానిక నాయకులు, ప్రయాణికులు ఎంపీకి విన్నవించారు. ప్రస్తుతం రేణిగుంట–గూడూరు, గూడూరు–రేణిగుంట ప్యాసింజర్ రైళ్లు మాత్రమే నడుస్తున్నందున నిలిపివేసిన ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ మొదటి దశ అభివృద్ధి పనులు మే 26 నాటికి పూర్తికానున్నాయని స్టేషన్ మాస్టర్ ఈ సందర్బంగా ఎంపీకి తెలిపారు. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తామని ఎంపీ గురుమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

