Bellampalli | భక్తిశ్రద్ధలతో గ్యార్మీ షరీఫ్ వేడుకలు..

  • 800 మందికి అన్నదానం..

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని కాల్‌టెక్స్ ఏరియా 13వ వార్డులో గ్యార్మీ షరీఫ్ వేడుకలను శనివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. గత 35 ఏళ్లుగా కులమతాలకు అతీతంగా జరుగుతున్న ఈ జెండా పండుగకు ఈసారి కూడా ప్రజలు భారీగా హాజరై కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకం చేశారు.

గౌసే ఆజం దస్తగిర్ పేరిట జరిగే జెండా ఊరేగింపు, ప్రత్యేక ప్రార్థనలలో స్థానికులు పాల్గొని సామరస్యానికి చక్కని ఉదాహరణ ప్రదర్శించారు. హిందూ, ముస్లిం, ఇతర మతాలకు చెందిన వారు కలిసి పాల్గొనడం ఈ కార్యక్రమానికి విశేషాకర్షణగా నిలిచింది.

ఈ వేడుకల్లో బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్, టీపీసీసీ ఓబీసీ స్టేట్ వైస్ చైర్మన్, మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నెల్లి రమేష్ పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి దువాలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులను అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బెల్లంపల్లి పట్టణం ఎప్పుడూ మతసామరస్యానికి చిరునామా అని పేర్కొన్నారు. 35 ఏళ్లుగా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా జరుగుతున్న గ్యార్మీ షరీఫ్ పండుగ ఇక్కడి ప్రజల ఐక్యతను చాటి చెబుతోందన్నారు. అందరికీ ఆయురారోగ్యాలు, శాంతి, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఎం.డి. హనీఫ్ పాషా, ఎం.డి. సలీం, కాజా మొయినుద్దీన్, రియాజ్, అమీర్, షరీఫ్, ఇంతియాజ్, మోజీబ్, నిహాల్, ఉస్మాన్, షారుక్, జహీర్, జాఫర్, జావీద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply