గంజాయిపై పోలీసుల నిఘా..

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాలన్న లక్ష్యంతో పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లు, విస్తృత తనిఖీలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై పోలీసులు ఈ ఏడాది (2025) ఆరంభం నుంచి తమ స్పెషల్ డ్రైవ్‌లను మరింత తీవ్రతరం చేశారు.
ఫలితంగా, జిల్లా వ్యాప్తంగా మొత్తం 41.7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఈ కేసులకు సంబంధించి 163 మందిని అరెస్ట్ చేసి, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ డివిజన్ల పరిధిలో నమోదైన కేసుల సంఖ్య జిల్లాలో మత్తు పదార్థాల వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోంది. మంచిర్యాల డివిజన్‌లో 19 కేసులు, బెల్లంపల్లిలో 22 కేసులు, జైపూర్‌లో 13 కేసులు నమోదయ్యాయి.
మంచిర్యాల జిల్లాలో గంజాయిని నిర్మూలిస్తం : ఎగ్గడి భాస్కర్, మంచిర్యాల డీసీపీ
గంజాయిని అక్రమంగా రవాణా చేసినా, విక్రయించినా, వినియోగించినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ ఏడాది ఇప్పటికే 41.7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, 163 మందిని అరెస్ట్ చేశాం. ఇది మా ప్రత్యేక డ్రైవ్‌ల తీవ్రతను తెలియజేస్తుంది. మా ప్రధాన ఉద్దేశం గంజాయి వ్యాప్తిని అరికట్టడమే.
మా బృందాలు నిరంతరం నిఘా ఉంచి, అక్రమ రవాణా చేస్తున్న వారి మూలాలను ఛేదించే పనిలో ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాలని కోరుతున్నాం. యువత ఈ మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు, తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు. గంజాయి అక్రమ రవాణాపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం, అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం.
