CM Revanth | సమ్మిట్ సభ దద్దరిల్లాలే!

CM Revanth | సమ్మిట్ సభ దద్దరిల్లాలే!

CM Revanth, హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం (Telangana) ఎంతో ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిటు ఏర్పాట్లు కనీవినీ రీతిలో ఏర్పాట్లు చేయా లని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంతాల్లో నిర్వహించే ఈ రెండు రోజుల వేడుకలను రెండేళ్ళ విజయోత్సవాలుగా జరపాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల పై శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. రెండేళ్ళ విజయోత్సవాలను ప్రతిబింబించేలా భారత్ ఫ్యూచర్ సిటీలో విశాలమైన ప్రాంగణంలో భారీ వేదిక ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

గ్లోబల్ సమ్మిట్ అందరినీ ఆకట్టుకునే అంతర్జాతీయ స్థాయి ఉత్సవాన్ని తలపించాలని పేర్కొన్నారు. డిసెంబర్ 8వ తేదీ, తొలి రోజున ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విజయాన్ని చాటి చెప్పాలని ఆదేశించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు చేయాలని హుకుం జారీ చేశారు. 9వ తేదీన రెండో రోజున తెలంగాణ భవిష్యత్తు దార్శనికతను, భవిష్యత్తు ప్రణాళికలతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ (దార్శనిక పత్రాన్ని) ఆవిష్కరించే కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఇదే ప్రాంగణంలో తెలంగాణలో పారిశ్రామిక విధానాన్ని, పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పేలా రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని విభాగాలు తమ భవిష్యత్తు లక్ష్యాలను కళ్లకు కట్టించే ఆడియో వీడియో ప్రదర్శనలు, ప్రజంటేషన్లు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ సూచించారు. దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు, అన్ని రంగాల్లో పేరొందిన పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు.

రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు వస్తున్న అతిథులకు తగిన వసతి సదుపాయాలతో పాటు అత్యున్నత భద్రత కల్పించాలని సీఎం ఆదేశించారు. ఏర్పాట్లలో ఎక్కడా లోటు జరగ కుండా చూడాలని, అన్ని విభాగాలు సమన్వయంతో ఈ వేడుకలను విజయవంతం చేయాలని చెప్పారు. 2047నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటంతో క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అన్ని విభాగాలు గ్లోబల్ సమ్మిట్లో కీలకంగా పాలుపంచుకోవాలని సీఎం (Telangana CM) ఆదేశించారు. భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకోవటం, రైజింగ్ డాక్యు మెంట్లో పొందుపరిచే ప్రతి అంశం పై లోతైన అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలను దిశానిర్దేశం చేసే ఈ డాక్యుమెంట్లో పొందు పరిచిన అంశాల పై సంబంధిత విభాగాలతో ఈనెల 25 నుంచి వరుసగా సమీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. అభివృద్ధిలో కీలకమైన రంగాలు, అందులో పాలుపంచుకునే అనుసంధాన విభాగాలన్నింటితో ఒక్కో సమీక్ష నిర్వహిస్తామని ఈ సందర్భంగా చెప్పారు.

మరి కొన్ని వార్తలకు లింక్ క్లిక్ చేయండి..

https://epaper.prabhanews.com/

Leave a Reply