COTTON | పత్తి రైతుల సమస్యలు

COTTON | పత్తి రైతుల సమస్యలు

COTTON | ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : పత్తి రైతుల సమస్యలపై అఖిలపక్షం కదం తొక్కింది. శుక్రవారం మాజీ మంత్రి జోగు రామన్న నేతృత్వంలో బిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా బోరజ్ జాతీయ రహదారి (44) పై రైతులు బైఠాయించి వాహనాలు స్తంభింపజేశారు. తేమశాతం కొర్రీలు లేకుండా సిసిఐ బేషరతుగా పత్తి కొనుగోలు చేయాలని, తేమలో 20శాతం వరకు సడలింపు ఇవ్వాలని, రైతులకు(For Farmers) ఇబ్బందిగా మారిన కపాస్ కిసాన్ యాప్ ఎత్తివేయాలని, మార్కెట్లో తడిసిన సోయాబీన్ ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జై జవాన్.. జై కిసాన్.. నినాదాలు మార్మోగాయి. ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. అంటూ రైతులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు.

విదేశీ పత్తి దిగుబడులకు 11% సుంకం ఎత్తివేతతో రైతులకు కష్టాలు..
జోగు రామన్న ధ్వజం..

దేశీయ పత్తి ఉత్పత్తులపై కేంద్రం వివక్ష కనబరుస్తూ పత్తి రైతులను సిసిఐ నట్టేట ముంచుతోందని మాజీమంత్రి జోగు రామన్న ద్వజమెత్తారు. “హలో రైతన్న”- చలో బోరజ్” పేరుతో ఈరోజు జాతీయ రహదారి దిగ్బంధనంలో భాగంగా రహదారిపై బైఠాయించి రామన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. విదేశాల నుండి దిగుమతి అయ్యే పత్తి సరకు రవాణాపై ఇదివరకు ఉన్న 11% సుంకాన్ని నరేంద్ర మోడీ(Narendra Modi) ఎత్తివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్లనే దేశీయ పత్తి మార్కెట్లో రైతులు పండించిన పత్తి పంటకు గిట్టుబాటు ధర రావడంలేదని, సీసీఐ కొనుగోళ్లకు మొహం చాటేస్తోందన్నారు. పత్తిలో తేమశాతం 22వరకు సడలించి, కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

భారీగా పోలీసుల మోహరింపు…
పత్తి రైతుల ఆందోళన చేయడంతో జాతీయ రహదారి దిగ్బంధం నేపథ్యంలో మహారాష్ట్ర, హైదరాబాద్ (Hyderabad) వైపు వెళ్లే వాహనాలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. ఆదిలాబాద్ డిఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసుల బలగాలు అక్కడ మొహరించి ఉన్నాయి.

Leave a Reply