GOLD| 48 గంటల్లో దొంగలను పట్టేశారు..

రూ.15 లక్షల విలువైన బంగారం స్వాధీనం
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి

GOLD| భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: భీమవరం పట్టణంలో బంగారం దొంగతనం కేసును 48 గంటల వ్యవధిలో ఛేదించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. భీమవరానికి చెందిన కణితి ఆంజనేయ ప్రసాద్ తాను పనిచేస్తున్న బంగారు నగల తయారీ దుకాణం నుంచి యజమాని ఆదేశాల మేరకు నరసాపురంలోని జైన్ గోల్డ్ షాప్‌కు డెలివరీ ఇవ్వడానికి 125 గ్రాముల బంగారు వడ్డాణం, 10 గ్రాములు ఆరు బంగారు లాకెట్స్ ను తన ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు.

ఈనెల 17న మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భీమవరం కొత్త బస్సు స్టాండ్‌లో నరసాపురం వెళ్లే బస్సులో ఎక్కడానికి ప్రయత్నిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ బంగారు నగలను చోరీ జరిగినట్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలో దిగి సీసీ కెమెరాల ఆధారంగా ఇరువురు నిందితులైన బంకురు కుమార్, మలుగుమాటి సుభాష్ అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుంచి రూ.15 లక్షలు విలువగల మొత్తం 135 గ్రాముల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితులను రిమాండ్ పంపించినట్లు ఎస్పీ తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించడంలో కీలకపాత్ర వహించిన వన్ టౌన్ సీఐ ఎం. నాగరాజు, ఎస్సై మోహన్ వంశీ, హెడ్ కానిస్టేబుల్ యోహోసువా, కానిస్టేబుల్ జి. రామకృష్ణ , అడ్డాల శ్రీనుకు నగదు రివార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి. భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కె.వీ.వీ.ఎన్ సత్యనారాయణ, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply