MLA | రూ.75 కోట్లతో రహదారి పనులు ముమ్మరం

MLA | రూ.75 కోట్లతో రహదారి పనులు ముమ్మరం

రామగుండం నియోజకవర్గం పురోగతి….
రామగుండం అభివృద్ధికి పెద్ద ఎత్తున పనులు…
ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్


MLA | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : రూ.75 కోట్లతో రహదారి పనులు ముమ్మరం చేయనున్నట్లు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ (M.S. Raj Thakur) తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలంలో గురువారం నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రాంత అభివృద్ధి, రైతుల సంక్షేమం, మౌలిక వసతుల పురోగతిపై పలు కీలక ప్రకటనలు చేశారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తోందని, ప్రతి రంగంలో అభివృద్ధి స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

రైతుల సమస్యల (farmers Problems) పై ప్రభుత్వ స్పందనను వివరించిన ఆయన, రామగుండం పరిధిలోని మండలాల్లో ఎక్కడా యూరియా కొరత రాకుండా రెండు లారీలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎరువుల కొరత కనిపిస్తున్న సందర్భంలో, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండం రైతులకు అవసరమైన యూరియా అందించగలిగామని చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల ప్రాంతం సాగునీటి సౌకర్యాలతో పుష్కలంగా మారిందని భావోద్వేగంగా వివరించారు.

రోడ్లు, వంతెనలు (Roads and bridges) – రూ. 50 కోట్లు, రూ. 25 కోట్లు విలువైన పనులు, ప్రాంత అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని రాజ్ ఠాకూర్ తెలిపారు. అంతర్గాం–గోలివాడ రహదారి పనులు పురోగమిస్తున్నాయని, బుగ్గ–గోదావరి రహదారి అభివృద్ధికి రూ.50కోట్ల నిధులు కేటాయించామని చెప్పారు. ఎక్కాల్పల్లి FCI వరకు రూ.25 కోట్లతో రోడ్డు నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. ఎక్కడి నుండి వచ్చినా 15–20 నిమిషాల్లో గోదావరిఖని చేరగలిగేలా రోడ్ల నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. పెద్దంపేట రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ పనులు కూడా ప్రారంభించినట్టు వివరించారు.

సాగు, త్రాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు, వంతెనలు, రవాణా వంటి కీలక రంగాల్లో ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎల్లంపల్లి గంగాదేవి ఆలయం, ముర్ముర్ శివాలయం, పాలకుర్తి మండలంలోని పెద్దమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, మడేలమ్మ, రామువలవారి ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. వెంనూరులో కొత్త దేవాలయం నిర్మాణం జరుగుతోందని వివరించారు. ఇతర మతస్థుల కోసం మసీద్, ఈద్గా నిర్మాణాలు కూడా చేపడుతున్నామని స్పష్టంచేశారు. రామగుండంను కోనసీమ తరహాలో పచ్చదనం, సౌందర్యం కలిగిన ప్రాంతంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

మేడిపల్లి వద్ద 500 మెగావాట్ల పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. మహిళా గ్రూపుల కోసం ప్రత్యేక RTC బస్సు కేటాయించామని రాజ్ ఠాకూర్ వెల్లడించారు. రాష్ట్రం లక్ష కోట్లతో అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబానికి సన్న బియ్యం, LOC, ఉచిత విద్యుత్, గ్యాస్, ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నామని తెలిపారు. “గత 10 ఏళ్లలో ఒక డబుల్ బెడ్రూం ఇచ్చారా?” అని ప్రశ్నించిన ఆయన, “ప్రతి అర్హుడికి ఇల్లు అందించే బాధ్యతను మా ప్రభుత్వం నిర్వర్తిస్తోంది” అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply