Ntr district | నిరుద్యోగుల కోసం..

Ntr district | నిరుద్యోగుల కోసం…

Ntr district, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ఎన్ఎస్కేఈడిసీ పథకం ద్వారా సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాల మంజూరుకు ఉమ్మడి కృష్ణా (కృష్ణా & ఎన్టీఆర్) జిల్లాలోని సఫాయి కర్మచారి వృత్తిలో ఉన్న నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార సంఘం లిమిటెడ్, మచిలీపట్నం కార్యనిర్వాహక సంచాలకులు షేక్ షాహిద్ బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి వాహన వ్యయం రూ.31,67,326లు రూపాయలు అని, ఇందులో 14,16,831.50 రూపాయల సబ్సిడీ లభిస్తుందని చెప్పారు. మిగిలిన 17,50,494.50 రూపాయల మొత్తాన్ని ఎన్ఎస్కేఎఫ్డిసి ఋణంగా పొందవచ్చని తెలిపారు. ఎన్ఎస్కేఎఫ్డిసి పథకం కింద 29-11-2023న ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) షెడ్యూల్ కులముల ఆర్థిక సహకార సంఘం వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఉమ్మడి కృష్ణా జిల్లాకు మంజూరు చేసిన 3000 లీటర్ల సామర్థ్యం గల సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు తిరిగి కేటాయింపు కోసం అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

గతంలో లబ్ధిదారులుగా ఎంపికై, ఋణాన్ని చెల్లించడంలో విఫలమైన వారి వాహనాలను పథకం షరతుల మేరకు కొత్త అర్హులైన అభ్యర్థులకు మళ్లీ మంజూరు చేస్తామన్నారు. ఆసక్తి, అనుభవం, క్రింది అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు 30-11-2025 లోపు, నేరుగా కృష్ణా జిల్లా ఎస్. సి .కార్పొరేషన్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. 5 మంది కలిసి ఒక గ్రూపుగా ఏర్పడాలని, గ్రూపులోని ప్రతి సభ్యుడు సఫాయి కర్మచారి వృత్తిదారు అయ్యి ఉండాలన్నారు. గ్రూపులో కనీసం ఒకరికి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు. వాహనం విలువలో సబ్సిడీని మినహాయించి మిగిలిన ఋణాన్ని 72 నెలసరి వాయిదాలలో ఈ కార్యాలయానికి క్రమం తప్పకుండా చెల్లించాలి. ఒక్కో వాయిదా రూ. 33,064 లుగా నిర్ణయించబడిందన్నారు. ఇతర వివరాలకు 9652057244 నంబర్ ను సంప్రదించాలని చెప్పారు.

Leave a Reply