Collector | చదువు ద్వారానే సాధ్యం

Collector | చదువు ద్వారానే సాధ్యం
Collector | నల్గొండ, ఆంధ్రప్రభ: చదువుతోనే అన్ని సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ ((District Collector) ఇలా త్రిపాఠి (Ila Tripathi) అన్నారు. ఈనెల 14 నుండి 20 వరకు నిర్వహిస్తున్న 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా బుధవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా కలెక్టర్ స్వర్గీయ భారత ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం విద్యార్థినులనుద్దేశించి జిల్లా కలెక్టర్ (District Collector) మాట్లాడుతూ… ఎంతో కష్టపడి ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారని, పేద ప్రజల సంక్షేమానికి గరీబి హఠావో నినాదాన్ని తీసుకువచ్చారని, ఆమెకు అనేక భాషలలో ప్రావీన్యురాలని, తండ్రి జవహర్లాల్ నెహ్రూ ప్రధాని అయినప్పటికీ ఆమె స్వయంగా కష్టపడి ప్రధానమంత్రి అయ్యారన్నారు. చిన్నప్పుడు కష్టపడితే పెద్దయ్యాక సంతోషంగా ఉంటారని, గొప్ప ఆలోచనలు, కష్టాలు ఎదుర్కొనే మనస్తత్వం కలిగి ఉంటే తప్పనిసరిగా భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉంటారని అన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఎం.ఆఫీస్ ఖాన్ మాట్లాడుతూ… గ్రంథాలయాలు విజ్ఞానాన్ని అందిస్తాయని, నల్గొండ జిల్లా (Nalgonda District) కేంద్ర గ్రంథాలయ ప్రస్తుత భవనం సరిపోనందున కొత్త బిల్డింగ్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.జిల్లా గ్రంధాలయ సంస్థ సెక్రటరీ బాలమ్మ, బాలుర, బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ సిబ్బంది, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీలకు బహుమతులు అందజేశారు.
