Warangal | మొదలైన పత్తి కొనుగోళ్లు…
రెండు రోజుల బంద్ అనంతరం ఏనుమాములకు పత్తి ని తీసుకొచ్చిన రైతులు
Warangal | ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్ : వ్యాపారులు సిసిఐ బంద్ అనంతరం బుధవారం నుంచి తిరిగి కొనుగోళ్లు ప్రారంభించారు. వరుసగా రెండు రోజులు పత్తి కొనుగోళ్లు (Cotton purchases) నిలిచిపోవడంతో బుధవారం మార్కెట్ కు అతితక్కువ సంఖ్యలో పత్తి తీసుకొచ్చారు. గురువారం అమావాస్య శుక్రవారం అనంతరం రెండు రోజులు శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో రైతులు పెద్దగా పత్తి తీసుకురాలేదు.
బుధవారం వచ్చిన పత్తిలో కొంత సీసీఐ (CCI) కొనుగోలు చేయగా, మరికొంత పత్తిని ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. వ్యాపారులు (Traders) క్వింటాల్ కు మద్దతు ధర రూ.8100 ఉండగా, కేవలం రూ.4400 కి కొనుగోలు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యాపారులు క్వింటాల్ పత్తిని రూ.4000 నుంచి రూ.6900 లోపే మెజారిటీ పత్తిని కొనుగోలు (Cotton purchases) చేశారు. పత్తిలో తేమశాతం ఎక్కువగా ఉందని, అతి తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు రైతులు చెబుతున్నారు. మొదటి నుంచి కూడా ప్రైవేట్ వ్యాపారులు రకరకాల కారణాలు చూపిస్తూ రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. మరోవైపున సీసీఐ కొనాల్సిన పత్తిని పూర్తిస్థాయిలో కొనకపోవడంతో రైతులు అతి తక్కువ ధరకే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు.


