RAYALASEEMA | రాయలసీమ పేరుకు 98 వసంతాలు

  • దత్తమండలం నుంచి ఆత్మగౌరవ సీమగా..
  • నమ్మకం, విశ్వసనీయ‌త, పౌరుషానికి పెట్టిన పేరు
  • రాష్ట్రానికి ముఖ్యమంత్రుల‌ను అందించిన సీమ
  • కర్నూలును రాజధానిగా వదులుకున్న రాయలసీమ

RAYALASEEMA | చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : నేడు రాయలసీమ (RAYALASEEMA)అనే పేరుకి 98 సంవత్సరాలు పూర్తవుతున్నరోజు. రాయలసీమ అంటే నమ్మకం, విశ్వసనీయత, పౌరుషం. వెనుకబడిన ప్రాంతమనే ముద్రతో ఉన్నా ప్రపంచమంతా తిరిగినా మాది రాయలసీమ అని చెప్పుకోవడంలో గర్వం చూపే స్వభావం ఈ నేల జనులది. ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువమంది ముఖ్యమంత్రుల‌ను అందించిన రాయలసీమ. స్వాతంత్ర పోరాటంలో ముందుంది పోరాడిన రాయలసీమ. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి వెలసిన పుణ్యభూమి. పోతులూరి వీరబ్రహ్మం లాంటి భవిష్యకారులను, పుట్టపర్తి సాయిబాబా వంటి సేవా మూర్తులను అందించిన పుణ్యభూమి. అనేక దివ్య క్షేత్రాలకు నెలవైన కర్మభూమి. తెలుగు ప్రజలకు భాగవతాన్ని ప్రసాదించిన బమ్మెర పోతన పుట్టిన ఆధ్యాత్మిక భూమి. శ్రీకృష్ణదేవరాయలు ఏలిన పవిత్ర భూమి. అలాంటి సీమకు రాయలసీమ అనే పేరు ఎలా వచ్చిందనే ఆసక్తి ప్రతీ ఒక్కరికి ఉంటుంది.1800కి ముందు సీమ ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో భాగంగా రతనాలసీమగా ప్రసిద్ధి చెందింది. అయితే సామ్రాజ్య పతనం తరువాత వరుస దాడులు, వివిధ పాలకుల పోరాటాల కారణంగా ఈ ప్రాంతం నైజాం ఆధీనంలోకి వెళ్లింది. మరాఠా ఆపద నుంచి బయటపడటానికి ఆంగ్లేయుల సైనిక సహాయం కోరిన నిజాం, వారికి పరిహారంగా సీమ ప్రాంతాలను వదిలివేసి ఇచ్చాడు. సీమ ప్రజల అభిమతం పట్టించుకోకుండా తీసుకున్న ఆ నిర్ణయంతో ఈ ప్రాంతం సీడెడ్ జిల్లాలు అంటే వదిలిచ్చిన ప్రాంతాలుగా పిలిచారు. తరువాత దానికి తెలుగు పేరుగా దత్తమండలంగా ప్రచారంలోకి వచ్చింది.

ఆంగ్లేయులు అధికారం చేపట్టిన తర్వాత సీమ పాలేగాళ్ల నుంచి భారీ ప్రతిఘటన ఎదురైంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (Uyyalawada Narasimha Reddy) వంటి వీరులు తొలి స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రారంభించారు. ఉత్తరాదిలో 1857 సిపాయిల తిరుగుబాటు పూర్వమే సీమ వీరులు ఆంగ్లేయుల దమనానికి ఎదురొడ్డి పోరాడటం చరిత్రలో ప్రత్యేక స్థానం పొందింది. నిజాం నుండి ఆంగ్లేయులకు వదిలివేయబడిన ప్రాంతమనే అపవాదంతో సీమ అనవసరంగా వెనుకబడిన గుర్తింపును మోసుకుంది. ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న దత్తమండలం అనే పేరును మార్చేందుకు అభ్యున్నతవాదులు ముందుకు వచ్చారు. 1928 నవంబర్ 17, 18 తేదీల్లో నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో, 18న కడప కోటిరెడ్డి అధ్యక్షతన ప్రత్యేక దత్తమండల ప్రాంత సమావేశం జరిగింది. అనంతపురం కాలేజీ ఉపాధ్యాయుడు, శ్రీకాకుళం వాసి చిలుకూరి నారాయణరావు ఈ ప్రాంతానికి రాయలసీమ అనే పేరు సరైనదని ప్రతిపాదించగా, పప్పూరి రామాచార్యులు దానికి మద్దతు తెలిపారు. సభ ఏకగ్రీవంగా ఆమోదించడంతో 1928 నవంబర్ 18 నుంచి ఈ నేల రాయలసీమగా ప్రాచుర్యం పొందింది. రాయలసీమ చరిత్ర త్యాగాలతో నిండినది. 1953లో మద్రాసు నుంచి వేరుపడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేందుకు రాయలసీమ చేసిన త్యాగం అపారం. భౌగోళికంగా దగ్గరగా ఉన్న మద్రాసును వదులుకుని, శ్రీబాగ్ ఒప్పందం మీద నమ్మకం ఉంచి, ఇతర తెలుగు ప్రజల కోసం 1956లో విశాలాంధ్ర ఏర్పాటులో కర్నూలు రాజధాని స్థానం ఇచ్చి గొప్ప మనసు చూపింది సీమ. ప్రేమ, స్నేహం, కష్టం ఇవి రాయలసీమ ప్రత్యేకతలు.

సినిమా పరిశ్రమ రాయలసీమను హింసాకాండకు ప్రతీకగా చూపిస్తూ అసత్య ప్రచారాలు చేసినప్పటికీ నిజమైన రాయలసీమ వాస్తవం భిన్నం. ఇక్కడి నాయకులు రాజకీయ పోటీల్లో కూడా వ్యక్తిగత ద్వేషం ప్రదర్శించని సంప్రదాయం ఉందని చరిత్ర చెబుతోంది. దళితులతో రెడ్లు మామ, బామ్మర్ది అనే సంబంధాలతో కలసి జీవిస్తున్నారని, కులవివక్ష తక్కువగా ఉందని జస్టిస్ పున్నయ్య కమిషన్ తన నిర్ధారణలో పేర్కొనడం సీమ స్వభావాన్ని తెలియజేస్తుంది. రాయలసీమ దేశంలో అనేక మహనీయులను ప్రసాదించిన గడ్డ. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు, ప్రకృతి అందాలు, సహజ వాతావరణం ఈ నేల ధనం. అయినప్పటికీ పరాయిపాలకులు సీమను కరువు సీమగా మార్చినా, సొంత పాలకులు కూడా అభివృద్ధిపరంగా పెద్దగా శ్రద్ధ చూపలేదు. ఆంగ్లేయులు నిర్మించిన కేసీ కెనాల్ తప్ప పెద్ద నీటి ప్రాజెక్టులు లేకపోవడం ఈ ప్రాంతం దురదృష్టం. సీమకు అత్యధిక ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ ఒక లక్ష ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్టు కూడా లేకపోవడం సీమ దుస్థితిని చూపుతుంది. ఆంగ్లేయులు కరువు నివారణ కోసం కృష్ణా, పెన్నా నదుల నీటిని ఉపయోగించే ప్రణాళికలు వేసినా తరువాత ప్రభుత్వాలు వాటిని వదిలేశాయి. ఈ పరిస్థితుల వల్లే సీమ వలసల ప్రాంతంగా మారింది. లక్షలాది మంది జీవనోపాధి కోసం విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఐక్యరాజ్యసమితి (United Nations) గణాంకాల ప్రకారం సీమలో పుడుతున్న ప్రతి 100 మంది శిశువుల్లో 45 మంది బలహీనంగా పుడుతున్నారనే విషయం అత్యంత విచారకరం. వేలాది రైతులు ఆత్మహత్యలు కూడా ఈ నేల భారంగా మిగిలాయి. 98 సంవత్సరాల క్రితం దత్తమండలం అనే అవమానపూర్వకపు పదాన్ని వదిలి రాయలసీమ ఆత్మగౌరవాన్ని తిరిగి పొందిన రోజు ఇది. కానీ సీమ ప్రజల అభివృద్ధికి రాజకీయ నాయకులు, ప్రజలు కలసి కృషి చేయాల్సిన అవసరం ఇప్పటికీ ఉంది. కులం, మతం, పార్టీ అభిమానాల కంటే ప్రాంత అభివృద్ధిని ముందుకు పెట్టినప్పుడే సీమ ప్రాంత ప్రతిష్టను మళ్లీ పొందుతుంది. ఒకనాడు రతనాలసీమగా వెలిగిన ఈ నేల మళ్లీ సస్యశ్యామలంగా మారే రోజు కోసం ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. రాయలసీమగా పునర్జన్మ పొందిన ఈ నేల 98 ఏళ్ల ప్రయాణానికి సార్థకత సాధించాలని ఉబలాటపడుతున్నారు.

Leave a Reply