Anganwadi | ఆకస్మిక తనిఖీ..

Anganwadi | ఆకస్మిక తనిఖీ..
Anganwadi, కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం దేవనకొండ మండల కేంద్రంలో అంగన్వాడీ కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో కాసేపు ముచ్చటించారు. పిల్లలను ఏమి తిన్నారని ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తూ, చాలా శుభ్రంగా నిర్వహిస్తున్నారని కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రతి రోజు ఇదే విధంగా ఉండాలని కలెక్టర్ అంగన్‌వాడీ (Anganwadi) సిబ్బందికి చెప్పారు. కిచెన్ గదిని పరిశీలిస్తూ.. కోడిగుడ్లు స్టాక్ వచ్చినపుడు వాటిని చెక్ చేసుకుని తీసుకోవాలి అన్నారు. ప్రతి రోజు పిల్లలకు పాలు ఇస్తున్నారా..? అంగన్వాడీ కేంద్రంలో మొత్తం ఎంత మంది పిల్లలు ఉన్నారు.? ఈరోజు ఎంత మంది వచ్చారు.? వారికి మెనూ ప్రకారమే భోజనం పెడుతున్నారా… అని కలెక్టర్ అంగన్వాడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రం పరిసరాల్లో పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంపిడిఓను ఆదేశించారు.
పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి..
పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణతో చదువుకోవడం, పాఠశాలలో ఉపాధ్యాయుల సూచనలు పాటించడం ద్వారా విజయాన్ని సాధించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదవాలన్నారు.. ఉపాధ్యాయులు ఏ విధంగా పాఠాలు చెబుతున్నారు.? భోజనం రుచిగానే ఉంటుందా లేదా…? ఏమైనా సమస్యలు ఉన్నాయా ? అని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం రుచిగా అందించాలి..
అనంతరం వంట గదిని పరిశీలిస్తూ.. రాగి జావ కొంచెమే చేశారు ఎందుకు అని ప్రశ్నించారు. పిల్లలు కొంత మంది మాత్రమే తాగుతున్నారని సిబ్బంది చెప్పగా విద్యార్థులందరికీ సరిపడే విధంగా రాగి జావ తయారు చేసి, అందరూ తాగే విధంగా పిల్లలను ఒప్పించాలని కలెక్టర్ సూచించారు. మధ్యాహ్న భోజన రుచి చూసి, భోజనం రుచిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల విద్యా శాఖాధికారి తరచుగా పాఠశాలలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం రుచిగా ఉండేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ (Collector) ఆదేశించారు. మెనూ ప్రకారం రుచి, శుచితో కూడిన మధ్యాహ్న భోజనం వడ్డించాలని పాఠశాల హెడ్మాస్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ జ్యోతి, ఎమ్ఈఓ తిమ్మారెడ్డి, విజయకుమారి, హెడ్ మాస్టర్ నజీర్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
