Achampeta | నేటి నుండి ఉమామహేశ్వరంలో ఉచిత దర్శనం
- ఫారెస్ట్ టోల్ గేట్ ఎత్తివేత
- ఉమామహేశ్వరంలో గణనీయ అభివృద్ధి
- భోగ మహేశ్వరంలో ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణం
- ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేట, ఆంధ్రప్రభ : కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శ్రీశైలం ఉత్తర ద్వారంగా వెలసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ధ్వజస్తంభం వద్ద దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఉమామహేశ్వర దేవస్థానం చైర్మన్ బీరం మాధవ రెడ్డితో కలిసి దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఇటీవల భారీ వర్షాలు, తుఫాను వల్ల ఏర్పడిన నష్టాన్ని పరిశీలించారు. అనంతరం చైర్మన్ మాధవరెడ్డి తో కలిసి ఆయన మాట్లాడుతూ… ప్రతాపరుద్రుని కాలంలో వెలసిన అత్యంత ప్రాచీన, ప్రాధాన్యత గల ఉమామహేశ్వర క్షేత్రంలో నేటి నుండి భక్తులందరికీ టికెట్టు లేకుండానే ఉచిత దర్శనం కల్పిస్తున్నామని, త్వరలోనే ఫారెస్ట్ వారి టోల్ గేట్ ను కూడా ఎత్తివేస్తున్నామని తెలిపారు.
ఇటీవల కురిసిన తుఫాను ప్రభావం వల్ల ఉమామహేశ్వర క్షేత్రంలో దెబ్బతిన్న పరిసరాల ప్రభావాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు సహకారంతో నాలుగు కోట్ల రూపాయలతో ఉమామశ్రమంలోని ప్రకృతి రమణీయత దెబ్బతినకుండా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పాపనాశనం వరకు అభివృద్ధి పనులు చేపట్టుతామని తెలిపారు.
2026 మే 3న దిగువన ఉన్న భోగం మహేశ్వరం లోని పంచలింగాల ఆలయాన్ని ప్రారంభిస్తున్నామని, త్వరలోనే టెండర్లను ఖరారు చేసి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మానం చేపడుతున్నామని, మెట్ల మార్గం వద్ద శివుని ప్రతిమ తో పాటు టూరిజం శాఖ వారి సహకారంతో విఐపి గెస్ట్ హౌస్ నూతన భవనాలు ప్రారంభిస్తున్నామని, త్వరలోనే వేద పాఠశాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఉమామహేశ్వర క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంతకు ముందుకు చైర్మన్ మాధవరెడ్డి, ఈవో శ్రీనివాస రావు, ఆలయ ప్రధాన అర్చకులు వీరయ్య, పాలకమండలి సభ్యులు ఎమ్మెల్యే వంశీకృష్ణకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బీరం మాధవ రెడ్డి, ఈవో శ్రీనివాసరావు, పాలక మండలి డైరెక్టర్లు, ఆలయ అర్చకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

