CPM | భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: పేదలకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపకుండా గృహాలను తొలగించడమే అభివృద్దా అని సీపీఎం టౌన్ కార్యదర్శులు బి. వాసుదేవరావు, ఎం. వైకుంఠరావు లు విమర్శించారు. భీమవరం కలెక్టరేట్ కార్యాలయం వద్ద వందలాది మంది పేదలతో డీఎన్ఆర్ కాలేజీ రోడ్డు పక్క నివాసమున్న పేదల ఇళ్లను తొలగించవద్దు. జగనన్నఇళ్ల స్థలాలు ఇచ్చిన వారికి ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి కి వినతి పత్రం ఇచ్చారు.
వాసుదేవరావు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ… పాలకులు మారుతున్నారు కానీ.. పేదవాడి సొంత ఇంటి కల తీరటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేస్తామని అనేకసార్లు ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పిన పాలకులు.. ఇచ్చిన వాగ్దానాన్ని సంవత్సరాల గడిచిన ఇంతవరకు హామీ అమలు చేయడం లేదని వారు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో జగనన్న ఇళ్ల పట్టాలుపేదలకు ఇచ్చారు కానీ ఇంతవరకు స్థలం ఎక్కడుందో లబ్ధిదారునికి తెలియదని వారన్నారు. పట్టా ఇచ్చారు కాని సంవత్సరాలు గడుస్తున్నాస్థలం చూపలేదన్నారు. దీనివలన పేదవాడు ఇంటి అద్దెలు కట్టలేక పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.

