YCP | ప్రశ్నిస్తే కేసులు..
YCP, ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఎన్టీఆర్ (NTR) జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. దాడులు దౌర్జన్యాలతో చెలరేగిపోతున్న కూటమి పార్టీ నేతలు ప్రశ్నించిన వారి పై దాడులకు తెగబడి కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూపూర్ లో వైసీపీ కార్యాలయం పై జరిగిన దాడిని ఖండిస్తూ విజయవాడలోని పిడబ్ల్యుడి గ్రామస్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ నాయకులు, శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. హిందూపురంలో కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసి వైసీపీ ఆఫీస్ ఫర్నిచర్ ధ్వంసం చేశారని, వైయస్సార్ (YSR) విగ్రహాన్ని కూడా అన్యాయంగా పగలకొట్టరని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అసలు లేదన్న ఆయన దాడులు దౌర్జన్యాలు తప్పా రాష్ట్రంలో ఏమి లేవన్నారు. జగన్ తెచ్చిన పెట్టుబడులకు సంబంధించి కూటమి నేతలు ఇప్పుడు ఒప్పందాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఏ నమ్మకంతో ఓటు వేశారో ఆ నమ్మకంతో పని చేయండి అని హితవు పలికారు. రేపు వైసీపీ అధికారంలోకి వస్తే.. ఈ దాడి చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

