- ఈనెల 25వ తేదీ వరకు అవకాశం
- ఇంటర్మీడియట్ రాష్ట్ర విద్యా మండలి కార్యదర్శి
INTER | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. అందుకు ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు బోర్డు మరో అవకాశం కల్పించింది. ఇప్పటి దాకా ఫీజు చెల్లించని రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు రూ.2వేలు ఆలస్య రుసుంతో ఈ నెల 25 వరకు ఫీజు చెల్లించవచ్చని నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా ఆదివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. జనరల్, ఒకేషనల్ గ్రూపుల విద్యార్థులకు ఈ అవకాశం వర్తిస్తుందన్నారు. కాగా, ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు కొత్త సిలబస్, సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. కొందరు విద్యార్థులు సెకండ్ లాంగ్వేజ్ ఆర్ట్స్ సబ్జెక్టులను, ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో బయాలజీ, గణితం సబ్జెక్టులను ఆరో పేపర్‌గా ఎంచుకున్నారు. దీంతో ‘ఒకరోజు ఒక పేపర్’ విధానంలో పరీక్షలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
అలాగే, గతేడాది ఫెయిలైన విద్యార్థులకు బ్యాక్ లాగ్ పేపర్లు పూర్తిచేసేలా షెడ్యూల్ రూపొందించారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి, సెకండియర్ పబ్లిక్ పరీక్షలు 24 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి పబ్లిక్ పరీక్షలు24 వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఒకేషనల్ విద్యార్థులకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు, జనరల్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు జరుగుతాయి. సమగ్ర శిక్ష ప్రాజెక్టులో భాగంగా నిర్వహిస్తోన్న ఒకేషనల్ ట్రేడ్స్‌కు ఫిబ్రవరి 13న ప్రాక్టికల్స్ ఉంటాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వేల్యూస్ పరీక్ష జనవరి 21న, పర్యావరణ విద్యపై 23న పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ చదివి విద్యార్థుల తల్లిదండ్రులు ఆయా కళాశాలలో ప్రిన్సిపాల్ ను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రంజిత్ భాషా తెలిపారు.

