Mahabubnagar | ఆదీవాసీ 9 తెగల భారీ ర్యాలీ..
లంబాడీలను తొలగించాలి…
Mahabubnagar | అచ్చంపేట, ఆంధ్రప్రభ : ఆదీవాసిల స్వయంప్రతిపత్తి కోసం అశువులు బాసిన భగవాన్ బిర్సా ముండా(Bhagavan Birsa Munda) ఆశయ సాధనకై, 50 సంవత్సరాలుగా విద్యా, ఉద్యోగ, ఉపాధి తదితర రంగాలలో రాజ్యాంగ వ్యతిరేకంగా ఆదీవాసి తెగల హక్కులను దోచుకుంటున్న లంబాడీలను ఎస్టీ తెగల జాబితా నుండి తొలగించాలని ఆదివాసీ 9 తెగల జేఏసి ఛైర్మన్ రామకృష్ణ(JAC Chairman Ramakrishna), రాష్ట్ర తుడుము దెబ్బ అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్‌లు సంయుక్తంగా డిమాండ్ చేశారు.
ఈ రోజు అచ్చంపేట పట్టణంలో ఆదివాసీ తెగల సాంస్కృతిక ఉద్యమవీరుడు భగవాన్ బిర్సాముండా 150వ జయంతి ఉత్సవాలు జన జాతీయ గౌరవ దివాస్ నల్లమల చెంచుల సహకారంతో ఆదీవాసీ 9 తెగల భారీ ర్యాలీని పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భగవాన్ బిర్సా ముండా బ్రిటీష్ వారి నుండి తన జాతిని రక్షించుకోవడానికి తన 25 సంవత్సరాల కాలంలోనే అనేక పోరాటాలు చేసి బ్రిటీష్ వారిచే నిర్భందించబడి విష ప్రయోగంతో మరణించడం జరిగిందని, వీరుడు చనిపోయినా వీరుడి స్పూర్తి, ఆశయాలు సజీవంగానే వుంటాయన్నారు.
పార్టీలకతీతంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్(Dr. B.R. Ambedkar) రాజ్యాంగంలో పొందుపరచిన షెడ్యూల్స్ ప్రకారం ఆదివాసి గిరిజనుల జాబితా నుండి లంబాడీలను తొలగించాలని కోరారు. అనంతరం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ర్యాలీ ఆధ్యాంతం ఆదీవాసీలు తమ సాంప్రదాయ వేషాదారణతో నృత్యాలు చేశారు. ర్యాలీలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా(Mahabubnagar District)లోని చెంచులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఆదివాసీ(Adivasi) తెగకు చెందిన గొండు, కోయ, కోలం, కొండా రెడ్డి, తోట, అందు, ప్రధాన్, చెంచు తెగల వాసులు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిఖార్జున్, మండ్లి అంజయ్య, ఉడుతనూరి సునిల్, హన్మంత్, వెంకటేశ్వర్లు తదితర చెంచు తెగల నాయకులు పాల్గొన్నారు.

