Nagar Kurnool | జిల్లాస్థాయి ఐక్యత పాదయాత్ర విజయవంతం

Nagar Kurnool | జిల్లాస్థాయి ఐక్యత పాదయాత్ర విజయవంతం
Nagar Kurnool | నాగర్ కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : స్వాతంత్య్ర సమరయోధుడు భారత తొలి ఉప ప్రధానిగా, హోమ్ మంత్రిగా దేశ స్వాతంత్య్రానంతరం స్వదేశీ సంస్థలను భారత యూనియన్‌లో విలీనం చేసిన ఉక్కు మనిషి, బర్డోలీ వీరుడు, ఇండియన్ బిస్మార్క్‌గా పేరు పొందిన వారు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ మహనీయుని ఆశయాలను నేటితరం యువత ఆదర్శంగా తీసుకోవాలని గుజరాత్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ పార్మాత్ జయంత్ సింగ్(Dr. Parmat Jayant Singh), జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, నాగర్ కర్నూల్ శాసనసభ్యుడు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి(Dr. Koochukulla Rajesh Reddy) జిల్లా యువతకు పిలుపునిచ్చారు.
ఈ రోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ @ జయంతిని సందర్భంగా ఐక్యత మార్చ్ ఘనంగా నిర్వహించారు. కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ, మేరా యువభారత్, జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యూనిటీ మార్చ్ పాదయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గుజరాత్ ఎంపీ డాక్టర్ పార్మాత్ జయంత్ సింగ్(MP Dr. Parmath Jayant Singh), జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, నాగర్ కర్నూల్ శాసనసభ్యుడు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి హాజరయ్యారు.
కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, బిర్సా ముండా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుండి అంబేద్కర్ విగ్రహం గుండా గాంధీ పార్క్(Gandhi Park) వరకు ఈ పాదయాత్ర సాగింది. జిల్లాస్థాయి పాదయాత్ర కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీ డాక్టర్ పార్మాత్ జయంత్ సింగ్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్(Badawat Santosh), ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు.
వందే మాతరం, ‘జైహింద్’ నినాదాలతో నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రం మార్మోగింది. ఈ సందర్భంగా గుజరాత్ రాజ్యసభ సభ్యుడు, దేశ స్థాయి నుండి నాగర్ కర్నూల్ జిల్లాకు కేటాయించిన 150 యూనిటీ మార్చ్ పాదయాత్ర ముఖ్యఅతిథి డాక్టర్ పార్మాత్ జయంత్ సింగ్ మాట్లాడుతూ…. నేడు త్రివేణి సంగమం లాంటి కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామని, 150 వ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాలు, గిరిజన ఆదివాసీల ఆరాధ్య దైవం బిర్సా ముండా(Birsa Munda) 150 జయంతి ఉత్సవాలు, వందేమాతర గీతం 150 ఏళ్ల పూర్తి చేసుకున్న రచన కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం యువతలో దేశభక్తి పెంపొందించేందుకు ‘ఏక్ భారత్ ఆత్మనిర్బర్ భారత్‌లో భాగంగా ఐక్యత మార్చ్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. దేశ సమైక్యత వెనుక ఉన్న మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారత పౌరుని బాధ్యత అని పేర్కొన్నారు. తాను సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మించిన స్థానం గుజరాత్ రాష్ట్రం నుంచి రావడం జరిగిందని, సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యతకు కృషి చేశారని దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల హృదయాలను ఏకం చేయాలని ఆలోచనతో దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ దూర దృష్టితో ఆలోచన చేసి ఇండియన్ సర్వీసెస్(Indian Services) అధికార వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్లనే నేడు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు(IAS, IPS) దేశ సమైక్యత అభివృద్ధికి నాంది పలుకుతున్నారని అధికారులకు స్వేచ్ఛ అందించి, ప్రజలకు నిష్పక్షపాతంగా వ్యవహరించేలా నిర్వహించేందుకు ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకు వచ్చిన వ్యవస్థ అని ఆయన గుర్తు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ మాట్లాడుతూ… సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యతకు ప్రతీక. 536 సంస్థానాలను ఏకం చేసి అఖండ భారతావనిని నిర్మించిన మహనీయుడు అని, హైదరాబాద్ సంస్థానం విలీనంలో కూడా ఆయన పాత్ర అమూల్యం అని అన్నారు.
నేడు తెలంగాణ రాష్ట్రంగా విరజిల్లుతుందని కలెక్టర్ తెలిపారు. సర్దార్ పటేల్ సేవలు దేశ ఏకతకు ఆదర్శం. ఆయన ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకం అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. యువత ఆయన స్ఫూర్తిని ఆచరణలో పెట్టి దేశ సేవలో ముందుండాలని కలెక్టర్ బాధావత్ సంతోష్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ… స్వాతంత్ర సమరయోధులు మహనీయుల ఆశయాలకు అనుగుణంగా యువతరం, విద్యార్థులు ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.


సర్దార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) దేశ సమైక్యతకు అనేక రకాల పోరాటాలను నిర్వహించిన వ్యక్తి అని, అలాంటి మహనీయునికి గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ఏక్తా విగ్రహాన్ని ఇటీవలే తాను సందర్శించానని అద్భుతమైన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీకి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మహనీయుల స్ఫూర్తితోనే యువత ముందుకు వచ్చేలా తమ ఆలోచనలను ఆశయాలను ఆచరణలోకి తీసుకోవాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. విద్యార్థులు యువతతో దేశ ఐక్యత సమగ్రత, భద్రతను కాపాడటానికి కృషి చేస్తానని రాష్ట్రీయ ఏక్తా దివాస్ ప్రతిజ్ఞను చేయించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా యూత్ అధికారి కోట నాయక్, జిల్లా యువజన సర్వీసుల అధికారి సీతారాం నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ, డిఎంహెచ్వో రవి నాయక్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జ్ఞాన శేఖర్, వివిధ శాఖల అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


