Nagarkurnool | కలెక్టర్ ఆగ్రహం..
Nagarkurnool | నాగర్ కర్నూల్, ఆంధ్ర ప్రభ – జిల్లాలో పత్తి కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్నదన్న అంశం పై జిల్లా కలెక్టర్ (Collector) బాదావత్ సంతోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం చిన్న ముద్దునూరు గ్రామం వినాయక కాటన్ మిల్ వద్ద సీసీఐ (Cotton Corporation of India) పత్తి కొనుగోలు కేంద్రాన్నిఆయన గురువారం పరిశీలించారు. సీసీఐ కేంద్రాన్ని సందర్శించి పత్తి కొనుగోలు ప్రక్రియ, ట్యాబ్ ఎంట్రీ, గేట్ ఎంట్రీ పాస్, పంట నమోదు ప్రక్రియను స్లాట్ బుకింగ్ తదితర అంశాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సమస్యలను సానకూలంగా స్పందించేలా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
చలి మంచు దృష్టా తేమశాతంలో కొంత మేర వెసులుబాటు ఇవ్వాలని, అకాల వర్షాల కారణంగా కొంత పత్తి పంట దెబ్బతిన్నందున గిట్టుబాటు ధర కల్పించాలని, సెంటర్లో కొనుగోళ్ల సమయం పెంచాలని, తెచ్చుకున్న పంటను అదే రోజు కొనుగోలు చేయాలని రైతులు కలెక్టర్ను కోరారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించి సీసీఐ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏ రోజు స్లాట్ బుకింగ్ జరిగిందో అదే రోజు కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలను పారదర్శకంగా నిర్వహించాలని అవసరమైతే అదనంగా సిబ్బందిని లాప్టాప్ లను వినియోగించి సాయంత్రం 6 గంటల్లోగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత సీసీఐ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ (Collector) మాట్లాడుతూ.. పత్తి రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో రైతులకు అండగా ఉంటుందని అన్నారు. పత్తి కొనుగోళ్లలో ఎవరైనా రైతులను ఇబ్బంది పెట్టినా, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పత్తి కొనుగోలు ప్రక్రియలో జాప్యం ఎందుకు జరుగుతోందో అధికారులు వివరించగా, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీసీఐ అధికారులు, మార్కెట్ కమిటీ సిబ్బందికి సమయానికి కొనుగోళ్లు జరగాలన్నది జిల్లా యంత్రాంగం ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. రైతులు తమ పత్తిని ఖచ్చితంగా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర (MSP) పొందాలని సూచించారు.
2025-26 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పత్తి పంటకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 8,110/-గా నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. పత్తిలో తేమ శాతం 8 నుండి 12% మధ్య ఉండాలి. ప్రతి 1% తేమ పెరిగినప్పుడు, ధర కూడా 1% తగ్గుతుందని ఆయన వివరించారు. 12% కంటే ఎక్కువ తేమ శాతం ఉన్న పత్తిని సీసీఐ వారు కొనుగోలు చేయరని రైతులు గుర్తుంచుకోవాలని సూచించారు. అందుకే రైతులు తమ పత్తిని ఇంటి దగ్గరే బాగా ఆరబెట్టి, సరైన తేమ శాతం కలిగిన పత్తిని విక్రయించాలని సూచించారు. రైతుల సౌకర్యార్థం ఈసారి “కపాస్ కిసాన్ యాప్” ద్వారా స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తున్నారని తెలిపారు.
రైతులు ముందుగానే యాప్‌లో జిన్నింగ్ మిల్లును ఎంపిక చేసుకుని, తగిన తేదీకి స్లాట్ బుక్ చేసుకోవాలి. బుకింగ్ చేసిన తేదీకి సరైన తేమ శాతం కలిగిన పత్తిని తీసుకువచ్చి విక్రయిస్తే, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి క్వింటాలుకు రూ. 8,110/- కనీస మద్దతు ధర పొందవచ్చని తెలిపారు. స్లాట్ బుకింగ్ విధానం వల్ల రైతులు జిన్నింగ్ మిల్లుల వద్ద రోజుల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా సులభంగా పత్తిని విక్రయించగలరని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ వెంట తెలకపల్లి తహసిల్దార్ జాకీర్ అలీ, సీసీఐ అధికారి దీపక్, పవన్, తదితరులు ఉన్నారు.

