మందకోడిగా ప్రారంభమై…

- ఊపందుకున్న పోలింగ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ మందకొడిగా ప్రారంభమై ఊపందుకుంది. ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ప్రారంభం నుంచి రెండు గంటల మధ్య కేవలం 9.2 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తొమ్మిది నుంచి ఓటర్లు రావడం ప్రారంభించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 31.94 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు 40.20 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుమారు 60 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు వేసిన అభ్యర్థులు..
ఎల్లారెడ్డి గూడ శ్రీనగర్ కాలనీ పోలింగ్ కేంద్రం 290 లో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కుమార్తెలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ఎల్లారెడ్డి గూడలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, ఆయన సతీమణి కలిసి వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ వెంకటగిరి పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు వేసిన ప్రముఖులు..
జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మధురనగర్‌లో ఓటు వినియోగించుకున్నారు. అలాగే ఐఏఎస్ అధికారులు బెన్హర్ దత్ మహేష్ ఎక్కా, స్వాతి లక్రా, వారి కుమార్తె కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సినీ ప్రముఖులు
ప్రముఖ సినీ దర్శకుడు రాజ్‌మౌలి, హీరో గోపిచంద్ తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
