- సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యవంతమైన జీవనం..
- ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు
- భీమవరంలో పకృతి సాగు అంగడి ప్రారంభం..
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనానికి సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ఎంతో మేలు చేస్తాయని ఏపీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణ రాజు అన్నారు. శుక్రవారం డిఆర్డిఏ ఆధ్వర్యంలో భీమవరం పీపీ రోడ్డు విస్సాకోడేరు వంతెన డౌన్ లో ఏర్పాటుచేసిన సేంద్రియ ఉత్పత్తుల అంగడిని రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు సంయుక్తంగా ప్రారంభించారు.
అంగడి సాంప్రదాయబద్ధంగా వెదురు బొంగులతో, రెల్లి గడ్డి పైకప్పుతో ఎంతో ఆకర్షణీయంగా డిఆర్డిఏ అధికారి పర్యవేక్షణలో తయారు చేయించడం జరిగింది. ప్రధాన రోడ్డు పక్కన చూపర్లను లను విశేషంగా ఆకట్టుకుంటుంది. అమ్మకానికి ఉంచిన కూరగాయలు, పండ్లు తాజాగా కనువిందు చేస్తున్నాయి.
ముఖ్య అతిథులు అంగడి అంతా పరిశీలించి సేంద్రియ ఉత్పత్తులను నగదు చెల్లించి కొనుగోలు చేశారు. రైతులతో, డ్వాక్రా మహిళలతో మాట్లాడి ఎక్కడ పండిస్తున్నారు, ఎక్కడైనా మార్కెట్లో అమ్ముతున్నారా, సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్ ఎలా ఉంది, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ.. సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాల అంగడి సాంప్రదాయబద్ధంగా మంచి వాతావరణంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎస్ హెచ్ జీల ద్వారా సేంద్రియ ఉత్పత్తుల అంగడిని నిర్వహించడం ఒక శుభ పరిణామం అన్నారు.
ప్రస్తుత తరుణంలో ప్రజలు క్రిమి సంహారక మందులు వినియోగించిన కూరగాయలు, పప్పు ధాన్యాలు వినియోగించిన కారణంగా అనేక అనారోగ్య రుగ్మతలకు గురి అవుతున్నారన్నారు. పెద్ద అమీరంలో కూడా సేంద్రీయ ఉత్పత్తుల అంగడి ప్రారంభించడానికి స్టోర్ తయారవుతుందని, రానున్న పది రోజుల్లో ప్రారంభిస్తామని తెలిపారు.
ఇదే తరహాలో అన్ని మండలాల్లో ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. పశ్చిమగోదావరి జిల్లాలను ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటి సేంద్రియ ఉత్వత్తులు అమ్మకాల స్టోర్లను ప్రారంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు సేంద్రియ ఉత్పత్తులను వినియోగించాలని, తద్వారా సేంద్రి ఉత్పత్తుల సాగు రైతులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. డిమాండ్ పెరిగే కొద్దీ సాగు చేసే రైతుల కూడా పెరుగుతారని, వాటి వినియోగం ద్వారా ప్రజలకు మంచి ఆరోగ్యం చే కోరుతుందని పేర్కొన్నారు.

