- అభివృద్ధికి ఆమడ దూరం ఖాయం
బాపట్ల బ్యూరో, ఆంధ్రప్రభ : బాపట్ల జిల్లా రగడకు మంత్రివర్గ ఉప సంఘం తుది రూపు ఇచ్చింది. జిల్లా ఏర్పడిన నాటి నుండి మా ప్రాంతం ఒంగోలు జిల్లాలోనే ఉంటుందని అద్దంకివాసులు పదే పదే ప్రకటిస్తున్నారు. అక్కడి ప్రజల కోరిక మేరకు అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలపటానికి మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించినట్లు తెలిసింది. అదే జరిగితే ఆర్థిక పరిపుష్టిలేని జిల్లాగా బాపట్ల నెలకొంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రధానంగా ఎన్నికలకు ముందు జిల్లాల పునర్విభజన అంశములు వైసీపీ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా జిల్లాల ఏర్పాటు చేశారని సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు పలు ఆరోపణలు చేశారు. వీటన్నిటికీ తెర దించుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు జిల్లాల పునర్విభజనపై మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించారు.
మంత్రివర్గ ఉప సంఘం బుధవారం సాయంత్రం భేటీ అయింది. ప్రభుత్వానికి అందజేయనున్న ప్రత్యేక నివేదికను రూపొందించారు. ఈ నివేదికను క్యాబినెట్ ఆమోదించి ఈ నెల పదో తేదీ అధికారికంగా ప్రకటన చేయనున్నారని ఉపసంఘంలోని మంత్రివర్గ సభ్యులు ప్రకటిస్తున్నారు. బాపట్ల, రేపల్లె, వేమూరు, చీరాల, పర్చూరు తో జిల్లా ఆవిర్భవించే అవకాశం ఉంది.

బాపట్ల జిల్లా పై రకరకాల ఊహాగానాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాటన్నిటికీ మంత్రివర్గ ఉప సంఘం తుది రూపు ఇచ్చింది. మూడున్నర దశాబ్దాల కృషి ఫలితంగా బాపట్ల జిల్లా ఏర్పడింది గతంలో నల్లమడ జిల్లాగా చేయాలని కోనా ప్రభాకర్ రావు బాపట్ల ను తెరమీదకి తీసుకువచ్చారు ఆనాటి నుండి ఈనాటి వరకు బాపట్ల జిల్లా చేయాలని సంకల్పంతో స్థానికంగా పనిచేసిన ప్రజాప్రతినిధులు అందరూ ప్రత్యేకంగా కృషి చేశారు.
ప్రధానంగా కోనా ప్రభాకర్ రావు తనయుడు కోన రఘుపతి తన రాజకీయ జీవితాన్ని జిల్లా సాధికారతతోనే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు తాను డిప్యూటీ స్పీకర్ గా ఉన్న సమయంలో బాపట్ల జిల్లా ప్రకటించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంగా ఉన్న బాపట్ల జిల్లా కేంద్రం చేశారు.
నాలుగో సంవత్సరంలో బాపట్ల జిల్లా కొనసాగుతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల మార్పు చేర్పులు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజన సంతృప్తి కరంగా లేదని కూటమి వాదిస్తోంది. తాజాగా జిల్లాల మార్పు చేర్పులు అవసరాన్ని గుర్తించింది. మంత్రుల కమిటీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో పర్యటించారు.
అనేక జిల్లాల్లో అక్కడి ప్రజాప్రతినిధులు పుర ప్రముఖులు, వివిధ వర్గాల నుండి వినతి పత్రాలను ఈ కమిటీ స్వీకరించారు. మంత్రుల కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఒక్కసారిగా బాపట్ల జిల్లా పై రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. జిల్లాను రద్దు చేస్తారని కొందరు, బాపట్ల జిల్లా కేంద్రాన్ని చీరాలలో ఏర్పాటు చేస్తారని మరికొందరు, ఇవన్నీ జరిగే అవకాశం లేదని కేవలం జిల్లా పేరు మాత్రమే మార్పు చేస్తారని ఇంకొందరు ప్రచారం చేస్తూ వస్తున్నారు.
చీరాలలో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తెరపై కొచ్చింది. బాపట్ల జిల్లా కేంద్రంగా చేయాలని పట్టుదలతో ఆరోజు బాపట్ల జిల్లా చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అద్దంకిని ప్రకాశంలో కలిపే ప్రతిపాదన అయితే కచ్చితంగా అమల్లోకి వచ్చింది. దీంతో ఐదు నియోజకవర్గాలతో బాపట్ల జిల్లా ఉండే అవకాశం ఉంటుంది. అద్దంకి నియోజకవర్గం లో ఉన్న గ్రానైట్ క్వారీలు జిల్లాకు ఆర్దిక వెన్నుదన్నుగా నిలిచాయి.
ప్రస్తుతం అద్దంకి ప్రకాశం జిల్లాలోకి వెళ్లిపోతే మిగిలిన బాపట్ల, రేపల్లె, వేమూరు, చీరాల, పర్చూరు ఐదు నియోజకవర్గాలతో జిల్లా కొనసాగుతుంది. వేమూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే 95శాతం కౌలు రైతులు ఉన్న నియోజకవర్గంగా నెలకొని ఉంది. ఆ నియోజకవర్గం నుండి ప్రభుత్వానికి ప్రత్యేక రెవెన్యూ ఏమి రాదు పర్చూరు నియోజకవర్గం ప్రధానంగా వాణిజ్య పంటలకు కేంద్రంగా కొనసాగుతుంది రైతు వారి విధానాలకి ఆ నియోజకవర్గం పెద్దపీట వేస్తుంది.
రేపల్లె నియోజకవర్గం లోని నిజాంపట్నం ఆక్వా రంగం ప్రధాన భూమికగా కొనసాగుతుంది .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రాంతంలోనే నిజాంపట్నం హార్బర్ ఆక్వా పార్కును అభివృద్ధి చేస్తున్నారు. తద్వారా మధ్య పరిశ్రమకు అనుబంధంగా ఆక్వా పరిశ్రమకు అనుబంధంగా ఆ ప్రాంతాలకు పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. బాపట్ల చీరాల నియోజకవర్గాల మధ్యలో పర్యాటక రంగంపై కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి అది అభివృద్ధి చెందితేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
దీనికి తోడు జిల్లాలో సుమారు 20వేల మంది మత్స్యకారులు సముద్రం మీద జీవనం కొనసాగిస్తున్నారు. వారిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో చీరాల నియోజకవర్గంలో రెండు మండలాలు, రేపల్లె నియోజకవర్గం లో ఒక మండలం పూర్తిగా చేనేత కార్మికులకు అడ్డగా మారింది. వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రధాన నిర్ణయాలు రూపకల్పన చేపట్టవలసి ఉంటుంది. జిల్లా విభిన్న వర్గాల కలయికగా విభిన్న రంగాల లో ప్రత్యేకతను చాటుకొని ముందుకెళ్తుంది.
ఏదేమైనప్పటికీ ఆయా రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తేనే జిల్లా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది అప్పటివరకు ఆర్థికంగా వెనకబడిన జిల్లా గానే బాపట్లను గుర్తించాల్సి ఉంటుందని ఆయన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఇప్పటి వరకు ఉన్న రెండు మంత్రి పదవిలో ఒకరు అద్దంకి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గొట్టిపాటి రవి. జిల్లాల పునర్విభజనలో భాగంగా అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో కలిపితే ఆ మంత్రి పదవి ఈ జిల్లా కోల్పోతుంది.
ప్రస్తుతం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగుతున్న రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాత్రమే ఈ జిల్లాలో మంత్రిగా కొనసాగుతారు. కాగా బాపట్ల పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నూతనంగా అద్దంకి ప్రకాశం జిల్లాలో కలిస్తే బాపట్ల పార్లమెంటు పరిధిలో బాపట్ల జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో రెండు నియోజకవర్గాలు కొనసాగుతాయి. భవిష్యత్తులో దీనిపైన వివిధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జిల్లాల పునర్విభజనలో అనేక ఊహాగానాలకు ఈనెల 10వ తేదీ అధికారికంగా ప్రభుత్వం తెరదించనున్నది.

