163 మ‌ర్రి చెట్లు తొల‌గించుకోండి

163 మ‌ర్రి చెట్లు తొల‌గించుకోండి

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : హైదరాబాద్‌..బీజాపూర్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ 163) విస్తరణకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యూనల్‌(ఎన్‌జీటీ) చెన్నై ధర్మాసనంలో కొనసాగుతున్న కేసు విచారణలో తుది తీర్పు వచ్చింది. ఈ రహదారి మార్గంలోని చేవెళ్ల వద్ద నిన్న ఆర్టీసీ బస్సును టిప్పర్‌ ఢీకొనడంతో 19 మంది ప్రయాణికులు చనిపోయిన రోజే ఎన్‌జీటీ(NGT) తుది తీర్పు వెలువడడం గమనార్హం.

గత నాలుగేళ్ల కాలంలో ఈ రహదారిపై వందల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. అంతే సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డును విస్తరించేందుకు అడ్డుగా ఉన్న మర్రి వృక్షాలను తొలగించాలని అధికారులు. చేవెళ్ల మర్రి వృక్షాలను కాపాడాలని పర్యావరణవేత్తల న్యాయ పోరాటంతో ఎందరో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

ఎన్‌జీటీ తుది తీర్పుకు సంబంధించి పూర్తి ప్రతి త్వరలో వెలువడే అవకాశం ఉంది. హైదరాబాద్ – బీజాపూర్‌ రహదారి ఇప్పుడు ఈ రహదారి పేరు చెబితేనే ప్రజలు, వాహనదారులు భయపడిపోతున్నారు. ఇటీవల కాలంలో ఈ రహదారిలో అనేక ప్రమాదాలు జరిగాయి. ఎందరో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నిన్న‌ ఈ రహదారిపై చేవెళ్ల వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఏకంగా 19 మంది ప్రయాణికులు చనిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

రాష్ట్రపతి మొదలుకొని ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి(State Chief Minister), మాజీ ముఖ్యమంత్రి ఇలా ప్రముఖులందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్‌హెచ్‌ 163 అభివృద్ధి విషయంలో గత నాలుగేళ్లుగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రహదారి అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని కేంద్రం చెబుతోంది. భూసేకరణ పూర్తి చేసి రైతులకు పరిహారం చెల్లించామని రాష్ట్ర ప్రభుత్వం(State Government) పేర్కొంటోంది. టెండర్లు పూర్తి చేసి మెఘా సంస్థకు కాంట్రాక్ట్‌ను అప్పగించామని ఎన్‌హెచ్‌ఏఐ(జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ) చెబుతోంది.

అయితే రోడ్డు పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ మార్గంలో ఉన్న వందల ఏళ్ల మర్రి వృక్షాలు రోడ్డు విస్తరణకు అడ్డంకిగా మారాయి. ఎన్‌హెచ్‌ 163 మార్గంలోని పోలీస్‌ అకాడమి నుంచి వికారాబాద్‌ జిల్లా పరిధిలోని మన్నెగూడ వరకు పెద్ద సంఖ్యలో మర్రి వృక్షాలు ఉన్నాయి. చేవెళ్ల మర్రి వృక్షాలను కాపాడండి అంటూ ఉద్యమాన్ని ప్రారంభించారు. జాతీయ హరిత ట్రిబ్యూనల్‌(Green Tribunal)(ఎన్‌జీటీ) చెన్నై ధర్మాసనంలో 2021లో కేసు వేశారు. ఈ కేసులో మర్రి వృక్షాలను తాకరాదని పేర్కొంటూ ఎన్‌జీటీ మధ్యంతర ఉత్తర్వూలను జారీ చేసింది. దీంతో రోడ్డు విస్తరణ పనులు ఆగిపోయాయి.

తాజాగా ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు, ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని ఎన్‌జీటీలో కేసు వేసిన పర్యావరణవేత్తలతో సంప్రదింపులు చేశారు. మర్రి వృక్షాలు తొలగించకుండా రోడ్డు విస్తరణ చేస్తామనే ప్రతిపాదనతో ఎన్‌హెచ్‌ఏఐ ముందుకు వచ్చింది. ఈ మార్గంలో ఉన్న మొత్తం 915 మర్రి వృక్షాలలో 150 చెట్లను మాత్రమే మరో చోటుకు తరలిస్తామని, మిగితా 765 వృక్షాలను అలాగే ఉంచి విస్తరణ పనులను చేపడుతామని ఎన్‌హెచ్‌ఏఐ(NHAI) నిర్ణయించింది.

గతనెల 31న ఎన్‌జీటీలో కేసు విచారణ సందర్భంగా ఎన్‌హెచ్‌ఏఐ ఈ ప్రతిపాదనను సమర్పించారు. దీంతో వెంటనే రోడ్డు విస్తరణ పనులు..మర్రి వృక్షాల తొలగింపుపై విధించిన స్టేను ఎన్‌జీటీ ఎత్తివేసింది. ఇరుపక్షాల వాదనలు అదే రోజు ఎన్‌జీటీ ధర్మాసనం విన్నది. సోమ‌వారం కేసులో తుది తీర్పును వెలువరించారు. సోమవారం ఉదయమే ఈ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం(Fatal Road Accident) జరిగింది. ఈ ఘటనలో ఏకంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాద ఘటన హైదరాబాద్‌..బీజాపూర్‌ రహదారి విస్తరణ పనులు, ఎన్‌జీటీ జోక్యంపై ప్రజలలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. బస్సు ప్రమాదం జరిగిన సోమవారమే ఎన్‌జీటీ తుది తీర్పును వెలవరించి ఎన్‌హెచ్‌ 163 రోడ్డు విస్తరణ పనులకు పచ్చజెండా ఊపింది. అయితే ఎన్‌హెచ్‌ఏఐ సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం మర్రి వృక్షాలను పరిరక్షించాలని ఎన్‌జీటీ తుది తీర్పులో పేర్కొంది. ఎన్‌జీపీ తుది తీర్పు కాపీ ఒకటి రెండు రోజులలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply