Odisaa | కళింగ యూనివర్సిటీలో నేపాల్ విద్యార్థిని ఆత్మహత్య – క్యాంపస్ లో టెన్షన్
భువనేశ్వర్‌లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ) యూనివర్సిటీ హాస్టల్లో నేపాల్‌కు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సోమవారం భారీ నిరసనలు చెలరేగాయి.
బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ప్రకృతి లాంసాల్ ఆదివారం సాయంత్రం తన హాస్టల్ గదిలో శవమై కనిపించింది. నేపాలీ జాతీయులతో సహా పలువురు నిరసనలకు దిగారు. నేపాలీ విద్యార్థులను క్యాంపస్‌ను ఖాళీ చేయమని యూనివర్సిటీ అధికారులు ఏకపక్షంగా ఆదేశించారని ఆరోపించారు. విచారణలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.
అద్విక్ శ్రీవాస్తవ అనే వ్యక్తి వేధింపులే ఆమె ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయని ప్రకృతి స్నేహితులు ఆరోపించారు. వందలాది మంది విద్యార్థులు క్యాంపస్‌లో గుమిగూడి, “వి వాంట్ జస్టిస్” అంటూ నినాదాలు చేశారు. ఈ సంఘటనపై విశ్వవిద్యాలయ పరిపాలన యంత్రాంగం సరైన నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు.
కాగా, ఉద్రిక్తత నేపథ్యంలో యూనివర్సిటీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నది. క్యాంపస్‌లోని హాస్టల్స్‌ను మూసివేసింది. 500 మందికిపైగా నేపాలీ విద్యార్థులను వారి దేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. వారిని బస్సుల్లో రైల్వేస్టేషన్‌కు చేర్చింది. అయితే ఉన్నట్టుండి తమను క్యాంపస్ నుంచి పంపివేయడంపై నేపాల్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణ ఏర్పాట్లు చేసుకోలేని తాము ఎక్కడ ఉండాలని, తమ దేశానికి ఎలా వెళ్లాలని ప్రశ్నించారు.
కాగా, కొన్ని గంటల తర్వాత యూనివర్సిటీ మరో ప్రకటన విడుదల చేసింది. క్యాంపస్, హాస్టళ్లలో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి, విద్యా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అన్ని ప్రయత్నాలు చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో నేపాల్ విద్యార్థులంతా క్యాంపస్‌కు తిరిగి రావాలని, క్లాసులకు అటెండ్ కావాలని విజ్ఞప్తి చేసింది
ఇదిలా ఉంటే భారత్‌లో నేపాలీ విద్యార్థి మృతిపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ సోమవారం స్పందిస్తూ, బాధిత విద్యార్థులకు కౌన్సిలింగ్ అందించేందుకు తమ ప్రభుత్వం న్యూఢిల్లీలోని నేపాల్ రాయబార కార్యాలయం నుంచి ఇద్దరు అధికారులను పంపించిందని చెప్పారు. అదనంగా, వారి ప్రాధాన్యత ఆధారంగా వారు తమ హాస్టల్లో ఉండటానికి లేదా ఇంటికి తిరిగి రావడానికి అవకాశం ఉందని నిర్ధారించడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి చెప్పారు.
అలాగే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాలని భారత్ కు సూచించారు. ఈ క్రమంలో భారత రాయబార కార్యాలయం కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కెఐఐటి)లో నేపాలీ విద్యార్థిని మృతి
పై స్పందించింది. ఈ విషాద మరణానికి ఖాట్మండు లోని భారత రాయబార కార్యాలయం
తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ క్లిష్ట సమయంలో మరణించిన వారి కుటుంబానికి రాయబార కార్యాలయం తన హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తుంది. ఎంబసీ కిట్ అధికారులతో పాటు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరుపుతోంది. దురదృష్టకర సంఘటనపై స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు . ..