TG | రాజీవ్ గాంధీ హిందువే కాదు : కేంద్ర మంత్రి బండి సంజయ్

  • ఆయన తండ్రి ఫిరోజ్ జహంగీర్ ఖాన్ పార్శీ
  • ఫిరోజ్ పూర్వీకులు ముస్లిం సంతతికి చెందిన వారు
  • రాజీవ్ గాంధీ భార్య సోనియా ఇటలీ దేశ క్రైస్తవురాలు
  • మరి రాహుల్ గాంధీ హిందువు ఎట్లా అవుతారు
  • కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి
  • బీసీలకు అన్యాయం చేసేందుకే కులగణన

కరీంనగర్, ఆంధ్రప్రభ : రాజీవ్ గాంధీ అసలు హిందువే కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘స్వదేశీ మేళా’’ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలు టీవీల్లో చూసిన తండ్రి కులమే కొడుకుకు వర్తిస్తుందని రాజీవ్ గాంధీ హిందువు అయినందున ఆయన కుమారుడు రాహుల్ గాంధీ కూడా హిందువేనని ఇయాళ కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

అసలు రాజీవ్ గాంధీ హిందువు ఎట్లా అవుతాడని, రాజీవ్ గాంధీ తండ్రి ఫిరోజ్ జహంగీర్ ఖాన్ పార్శీ మతస్థుడన్నారు. పర్సియాలోని ముస్లిం సంతతికి చెందిన వాళ్ల పూర్వీకులు ఇండియాకు వచ్చి పార్శీలుగా మారారన్నారు. ఫిరోజ్ జహంగీర్ ఖాన్ మతమే రాజీవ్ గాంధీకి వర్తిస్తుందని కాబట్టి రాజీవ్ గాంధీ అసలు హిందూ కానేకాదన్నారు.

సోనియా గాంధీ ఇటలీ దేశానికి చెందిన క్రైస్తవురాలు అన్నారు. రాజీవ్ గాంధీ ముస్లిం మూలాలున్న పార్శీ మతస్తుడని, సోనియాగాంధీ క్రైస్తవురాలనారు. టెన్ జన్ పథ్ లోని రాహుల్ గాంధీ కుటుంబానికి కులం, మతం, జాతి, దేశం లేదన్నారు.

కానీ మోదీ పక్కా ఇండియన్ అని, మోదీకి విదేశీయులే సాష్టాంగ నమస్కారం చేస్తున్నారన్నారు. విదేశాల్లో ప్రతి భారతీయుడు గర్వంగా ఇండియన్ ఆని కాలర్ ఎగరేసి తలెత్తుకుని తిరిగేలా చేస్తున్నారన్నారు.

బీసీ కుల గణన పేరుతో హిందువులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందన్నారు. ఒక వర్గానికి, మతానికి కొమ్ము కాసేందుకు కాంగ్రెస్ నేతలు బీసీల జనాభా తగ్గించే కుట్ర చేస్తున్నారు. 10 శాతమున్న ముస్లింలను బీసీల్లో కలిపారని,

42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అందులో 10 శాతం ముస్లింలకే చెందుతాయన్నారు. ఈ లెక్కన బీసీలకు 32 శాతం రిజర్వేషన్లు మాత్రమే వర్తిస్తాయని, మరి 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారో సమాధానం చెప్పాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తీరువల్ల బీసీ న్యాయం కంటే అన్యాయం ఎక్కువ జరుగుతోందని, మహారాష్ట్రలో మాదిరిగా మత మార్పిడులు, లవ్ జిహాదీలపై చట్టం తీసుకురావాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించిందని, అట్లాంటి చట్టమే తెలంగాణలోనూ తీసుకురావాలన్నారు.

అంతే తప్ప ముస్లింలను బీసీ జాబితాలో కలిపి కేంద్రానికి పంపితే ఆ జాబితాను కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదన్నారు. ఇందులో ఎలాంటి మొహమాటం లేనేలేదని, హిందూ ధర్మ సమాజం కోసం నిరంతరం పనిచేస్తామన్నారు.

మమ్ముల్ని మతతత్వ వాదులుగా ముద్రవేసే భయపడే ప్రసక్తే లేదని, ఇకనైనా బీసీ జాబితాలో నుండి ముస్లింల జనాభాను తీసేసి కేంద్రానికి పంపిస్తే తప్పనిసరిగా ఆ జాబితా ఆమోదం పొందేలా చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *