పేదోళ్లకు మంచి వైద్యం.. అతడికి నచ్చదు

 

పేదోళ్లకు మంచి వైద్యం అతడికి  నచ్చదు
ఐదేళ్లు వంచించాడు.. అధికార దాహం తీరలేదు
పేదలపై కక్షతోనే నీచ రాజకీయాలు
గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ధ్వజం

ఆంధ్రప్రభ, మంగళగిరి (గుంటూరు జిల్లా) పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తుంటే చూసి ఓర్వలేక, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. పేదల ఆరోగ్యంతో జగన్ చెలగాటం ఆడుతున్నారని, కూటమి ప్రభుత్వంపై బురదజల్లే దుర్మార్గపు ప్రయత్నాన్ని తిప్పి కొడతామని ఆయన హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ, వైసీపీ పాలనలోని విధ్వంసకర విధానాలను తూర్పారబట్టారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక చర్యలకు జగన్ మోకాలడ్దుతున్నారని యరపతినేని మండి పడ్డారు.

పేదల వైద్య సేవలకు జగనే అడ్డంకి

కూటమి ప్రభుత్వం పీపీపీ (PPP) విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించి, పేదలకు అతిపెద్ద వైద్య వరాన్ని అందిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి దీనిని అడ్డుకోవడం దుర్మార్గమని యరపతినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి కాలేదని, ప్రభుత్వమే ఆ పని చేపట్టాలంటే ఇంకో పదేళ్లు పడుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం పీపీపీ ద్వారా కేవలం రెండేళ్లలో 1750 మెడికల్ సీట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తుంటే మాజీ ముఖ్యమంత్రి నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర విద్యార్థులకు 220 అదనపు సీట్లు, అందులో 110 సీట్లు పేద, మధ్యతరగతి విద్యార్థులకు దక్కుతుంటే వైసీపీకి కడుపు మంట ఎందుకు అని యరపతినేని ప్రశ్నించారు. పీపీపీ విధానంలో నిబంధనలు, రిజర్వేషన్లు పూర్తిగా అమలవుతాయన్నారు. 33 ఏళ్ల తర్వాత ఈ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వ ఆస్తి అవుతాయి అని చెప్పారు. ఇది తమ అధినేత చంద్రబాబు విజన్ కు గీటురాయి అని ఆయన స్పష్టం చేశారు. ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీనైనా నిర్మించలేని జగన్, కూటమి ప్రభుత్వంపై బురదజల్లడానికి సిగ్గు ఉండాలన్నారు. ఖర్చంతా కేంద్రం ఇచ్చిన నిధులే అని యరపతినేని ఎద్దేవా చేశారు. జీఓ 107, 108, 133 ద్వారా ప్రభుత్వ కాలేజీల్లో 50% సీట్లను ప్రైవేటీకరించింది జగనే అన్నారు. ఇతరులపై నిందలు వేయడానికి ముందు ఆ పాపం తనదే అని గుర్తుపెట్టుకోవాలని ఆయన ఘాటుగా హెచ్చరించారు.

లోకేష్ తెచ్చిన పెట్టుబడులపై నీచ వ్యాఖ్యలా..

45 ఏళ్ల సుదీర్ఘ అనుభవం, దార్శనికత కలిగిన చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అత్యున్నత స్థాయికి చేరుకోవడం తథ్యమని యరపతినేని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చినట్టే, ఏపీని కూడా అభివృద్ధి చేస్తారు అని ఆశాభావం వ్యక్తపరిచారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత, యంగ్ విజనరీ లోకేష్ ఆధ్వర్యంలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయని లోకేష్ పని విధానాన్ని ప్రస్తుతించారు. దేశంలో ఏ రాష్ట్రమూ సాధించలేని భారీ పెట్టుబడులను లోకేష్ సాధిస్తే, దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు దిగజారి నీచ వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఆయన ధ్వజమెత్తారు. గూగుల్ డేటా సెంటర్ లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తుంటే, గూగుల్ రాలేదంటూ అడ్డగోలు వాదనలు చేస్తారా? ఒకవైపు రాలేదని, మరోవైపు పర్యావరణం దెబ్బతింటుందని వాదనలు చేయడం వైసీపీ అవివేకానికి పరాకాష్ట. మరి జగన్ పర్యటనల కోసం వందలాది చెట్లను నరికినప్పుడు పర్యావరణం దెబ్బతినలేదా అంటూ నిలదీశారు. వైసీపీ అయిదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురాలేకపోయిందని, ఉన్న జాకీ, అమర్ రాజా వంటి సంస్థలను రాష్ట్రం నుంచి తరిమి కొట్టారని, కియా వంటి సంస్థలను బెదిరించారని మండిపడ్డారు.

యువత భవిష్యత్తు ఫిష్, మటన్ మార్కెట్లకా?

వైసీపీ రాష్ట్ర యువత భవిష్యత్తును ఫిష్, మటన్ మార్కెట్లకు పరిమితం చేద్దామని చూసిందని యరపతినేని చమత్కరించారు. వైసీపీ పాలనలో యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్థితిని సృష్టించింది అని ఆరోపించారు. ఒకవైపు ప్రజాధనాన్ని వృధాగా పార్టీ కార్యాలయాలకు రంగులు వెయ్యడానికి ఖర్చు పెట్టిన జగన్, పర్యావరణాన్ని పట్టించుకోకుండా రుషికొండలో భవనం నిర్మించి, మెడికల్ కాలేజీలను మాత్రం నిర్మించలేకపోవడం దారుణం అని యరపతినేని ఆవేదన వ్యక్తం చేశారు.

హత్యలను కులాలకు అంటగడుతున్నాడు

లిక్కర్ స్కాంలో తాడేపల్లి ఆధారాలు వెలువడుతుంటే, ప్రజల దృష్టి మళ్లించేందుకు కల్తీ మద్యం కథను సృష్టించిందని ఎమ్మెల్యే యరపతినేని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో జరిగిన హత్యను కూడా కులాలతో ముడిపెట్టి, వైసీపీ విష ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతోంది అన్నారు. వైసీపీ ఒక రాజకీయ పార్టీ కాదని, అది రాక్షస సమూహం అని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడించిన భూతాన్ని తరిమికొట్టిన ఆనందోత్సవాలతో ప్రజలు ఘనంగా దీపావళి పండుగ జరుపుకున్నారని ఆయన తెలిపారు. వైసీపీ స్వభావంలో విధ్వంసం ఉంది… అధికారంలో ఉన్నా, లేకపోయినా వారి ధోరణి నాశనకారిగానే ఉంటుంది… ఈ విధ్వంస వ్యాధి రాష్ట్రాన్ని మళ్లీ ఆక్రమించకుండా ప్రజలు కాపాడుకోవాలి అని యరపతినేని శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply