పోలీసు కుటుంబాలకు అండగా ప్రభుత్వం
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం
శ్రీకాకుళం, అక్టోబర్ 21(ఆంధ్రప్రభ బ్యూరో): ప్రజల రక్షణ విధుల్లో ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేసే కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె. వి. మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించిన ఆయన అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు సిబ్బంది పరేడ్ కమాండర్ శంకర్ ప్రసాద్ నేతృత్వంలో నిర్వహించిన స్మృతి పరేడ్ ద్వారా అమర వీరులకు ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ, అమరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ప్రజల, ధన, మాన ప్రాణాలను కాపాడటంలో పోలీసులు చూపుతున్న చొరవ, గంజాయి, మాదక ద్రవ్యాల రవాణాను సవాల్‌గా తీసుకుని జిల్లాలో గొప్పగా పనిచేస్తున్న పోలీసులను ఆయన అభినందించారు. మహిళలపై అఘాయిత్యాలు, అపహరణలు, రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ముఖ్యంగా సైబర్ క్రైంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, టెక్నాలజీ సాయంతో నిఘా వేస్తూ, నేరస్తులను పట్టుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం సీసీటీవీలు పెట్టే ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, అలాగే పోలీసు రిక్రూట్మెంట్ తరచూ జరగాల్సి ఉందన్నారు. ఇటీవల పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన ఆరు వేలమందికి త్వరలోనే నియామక పత్రాలను అందజేయునున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ, పోలీసులు లేకుండా ప్రగతి లేదని, దేశ చరిత్రలో పోలీసు సంస్మరణ దినం విశిష్టమైనదని పేర్కొన్నారు. పోలీసుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అంటూ గంజాయి, మహిళల భద్రత అంశాలపై దృష్టి సారించాలని చెప్పారు.
ఎస్పీ కె. వి. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ,.. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. విధి నిర్వహణే పరమావధిగా భావించే పోలీసులకు ఈ రోజు చాలా ముఖ్యమని ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రాణత్యాగం చేసిన 5 గురు పోలీసులు (ఎస్. బంగారు నాయుడు, ఏ. పాపారావు, ఎం. నరేంద్రదాస్, ఎం. వెంకటరమణ, పి. కృష్ణమూర్తి) సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. పోలీసులు కుటుంబాలకు దూరంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు కల్పిస్తోందని, ఈ ఏడాది ఆరు కారుణ్య నియామకాలు ఇచ్చామని, ఆరోగ్య భద్ర, కో-ఆపరేటివ్ సొసైటీల ద్వారా సహాయం అందిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు శాఖ రూపొందించిన అమర వీరుల గ్రంథంలో దేశ రక్షణలో ప్రాణ త్యాగం చేసిన 191 అమర వీరుల పేర్లను పుస్తకాన్ని వ్యవసాయశాఖ మాత్యులు ఎస్పీకి అందజేశారు. అదనపు ఎస్పీ కె.వి. రమణ పుస్తకంలో పేర్లు చదివి వినిపించారు. అనంతరం ఓపెన్ హౌస్ ను ప్రారంభించిన అతిథులు జిల్లా పోలీసుల ఆయుధ సంపత్తిని తిలకించారు. కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసన సభ్యులు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, ఎన్. ఈశ్వర రావులతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, అదనపు ఎస్పీ కె.వి. రమణ, డీఎస్పీలు వివేకానంద, లక్ష్మణరావు, శేషాద్రి, ఆర్డీవో సాయి ప్రత్యూష అమర వీరుల కుటుంబ సభ్యులు, సీఐలు పాల్గొన్నారు.