పోలీసు అమరవీరుల స్ధూపానికి ఘన నివాళి
అమరులైన పోలీసుల కుటుంబాలకు అండగా నిలవాలి
ప్రిన్సిపల్ డిస్ట్రిక్ జడ్జి, జిల్లా కలెక్టర్, ఎస్పీ
చిత్తూరు, అక్టోబరు 21 (ఆంధ్రప్రభ) : సమాజంలో పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సంధర్బంగా మంగళవారం చిత్తూరు ఆర్మ్డ్ రిజర్వు పరేడ్ మైదానంలో అమరవీరుల స్ధూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి అరుణ సారిక, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పి తుషార్ డూడి, నగర మేయర్ ఆముద, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, చూడ చైర్మన్ కటారి హేమలత పాల్గొన్నారు.

తొలుత చిత్తూరు జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ జడ్జి అరుణ సారిక పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి మాట్లడారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరులను స్మరించుకోవడం మన భాద్యత అని, వారు చేసిన త్యాగాలు, సేవలు మరువలేనివని అన్నారు. పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకుంటామన్నారు. ప్రజాశ్రేయస్సు, శాంతి భద్రతలే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీసులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారని, పోలీసులకు ప్రజల సహకారం చాలా అవసరం అన్నారు. జిల్లాలోని పోలీసులు అండగా ఉంటూ అనేక రకాలుగా వారిని ఆదుకుంటామన్నారు. పోలీసులు పడుతున్న కష్టాన్ని శ్రమను గుర్తిస్తే వారికి అదే సంతోషం ఇస్తుందన్నారు.

విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరించుకోవడం మన బాధ్యతన్నారు. శాంతి భద్రతల కట్టడిలో పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తున్న పోలీసులను సమాజం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు.జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న పోలీసు దళాలపై జరిగిన దురదృష్టకర సంఘటనను గుర్తు చేసుకుంటూ, వారి త్యాగాలను స్మరించుకోవడం ఎంతో ప్రాముఖ్యత కలిగినదని అన్నారు. అమరవీరుల త్యాగాలు భారతదేశం కోసం ఇచ్చిన అత్యున్నత సేవల కిందకు వస్తాయని, వారి స్ఫూర్తిని ప్రతి ఒక్కరం మదిలో దాచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పోలీసులు సమాజంలో శాంతి భద్రతలు నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలను మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు.

జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, ఐపిఎస్ గారు మాట్లాడుతూ, పోలీసులు ప్రజల రక్షణ కోసం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ ప్రేరణాత్మకమని, వారి స్ఫూర్తితో పోలీసు శాఖ నిరంతరం ప్రజల కోసం సేవలందిస్తుందన్నారు. పోలీసులు ఎల్లప్పుడూ ప్రజల భద్రత, శాంతి స్థాపనకు కట్టుబడిన వారని స్పష్టం చేశారు. అదే విధంగా, పోలీసు అమరవీరుల స్మారక స్థూపాలకు ప్రతి ఒక్కరూ ఆరాధనగా నివాళులు అర్పించాలన్నారు.

అమరులైన వారి కోసం శ్రధ్దాంజలి ఘటిస్తూ, నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అమరులైన పోలీసు కుటుంబాల వారిని శాలువతో సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్మఇంచార్జ్ అడ్మిన్ శ్రీ ఎస్.ఆర్.రాజశేఖర రాజు, అడిషనల్ ఎస్పీ ఏ.ఆర్. శ్రీ శివానంద కిషోర్, చిత్తూరు ఎస్‌డీపీఓ శ్రీ టి.సాయినాథ్, డీటీసీ. డీఎస్పీ శ్రీ జె.రాంబాబు, ఏఆర్ డీఎస్పీలు శ్రీ చిన్ని కృష్ణ, శ్రీ మహబూబ్ బాష, జెడ్.పి చైర్మన్ శ్రీ శ్రీనివాసులు, చుడా చైర్మన్ శ్రీమతి కటారి అనురాధ, మేయర్ శ్రీమతి అముద, పట్టణంలోని అందరు సీఐ లు, ఆర్ఐలు, ఎస్సై లు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీ ఉదయ్ కుమార్, పోలీసు కుటుంబాలు పాల్గొన్నారు.