జైనూర్, (ఆంధ్రప్రభ): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, సిర్పూర్ (యు) మండలంలోని పుల్లార గ్రామ పంచాయతీ కేంద్రంలో ఎట్టకేలకు వెలుగులు నిండాయి. చాలా రోజులుగా ఈ గ్రామంలోని వీధి స్తంభాలకు బల్బులు లేకపోవడం, పంచాయతీ వద్ద నిధులు లేకపోవడంతో చీకటి రాజ్యమేలింది.
ఈ దీపావళి పండుగకు కూడా గ్రామం చీకట్లో ఉండకూడదని ఆ గ్రామానికి చెందిన యువ నాయకుడు వెడ్మ దత్తు పట్టుదల వహించాడు. ఆయన వెంటనే టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్కను సంప్రదించారు. ఆమె ఇచ్చిన సలహా, సహకారంతో వెడ్మ దత్తు స్వయంగా రంగంలోకి దిగాడు.
సోమవారం రాత్రి, దత్తు తానే స్వయంగా విద్యుత్ స్తంభాలకు బల్బులు అమర్చారు. దీంతో దీపావళి సందర్భంగా పుల్లార గ్రామంలో విద్యుత్ దీపాల కాంతులు వెలిగి, చాలా రోజుల అంధకారం తొలగిపోయింది. గ్రామంలో వెలుగులు రావడంతో గ్రామస్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. వెడ్మ దత్తు చేసిన ఈ కృషిని అందరూ అభినందించారు.