ఏపీ మద్యం కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు నుండి ఊరట లభించింది. ఆయన విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.
మిథున్ రెడ్డి అక్టోబర్ 26 నుంచి నవంబర్ 4 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు గాను, రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
అదే విధంగా, విదేశీ పర్యటన ముగిసిన వెంటనే తన పాస్‌పోర్టును తిరిగి కోర్టుకు సమర్పించాలని కూడా న్యాయస్థానం సూచించింది. అలాగే, పర్యటనలో వెళ్లే దేశాలు, ఉండే చిరునామా వంటి వివరాలను ముందుగానే కోర్టుకు అందజేయాలని ఆదేశించింది.
అయితే, ఏపీ మద్యం కేసులో మిథున్ రెడ్డి నాలుగో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆయనను ఈ ఏడాది జూలైలో అరెస్ట్ చేశారు. దాదాపు 71 రోజులు జైలులో ఉన్న అనంతరం, సెప్టెంబర్ 29న కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

