పిజీ కోర్సుల్లో సర్కార్ల బ్రేకులు

పిజీ కోర్సుల్లో సర్కార్ల బ్రేకులు

  • 5 వేల మంది భవితవ్యం.. అంధకారబంధురం

బయ్యారం , ఆంధ్ర ప్రభ : స్వ రాష్ట్రం సిద్ధిస్తే మన చదువులు మనకే మన ఉద్యోగాలు మనకే అన్న నినాదం అభాసు పాలవుతుందా… రాష్ట్ర విభజనలో పొందుపరిచిన ఉమ్మడి హక్కులు కాల రాయబడుతున్నాయా.. అంటే వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు అవుననే అంటున్నారు. రాష్ట్ర విభజనలో విద్యకు సంబంధించి పది సంవత్సరాల వరకు ఉమ్మడి హక్కులు కొనసాగుతాయని స్పష్టంగా పొందుపరిచారు.

ఆ హక్కుల హామీతోనే వైద్య, ఇంజనీరింగ్ విద్యార్థులు ఎలాంటి అనుమానాలు లేకుండా రెండు రాష్ట్రాల్లో ఎక్కడ ఫ్రీ సీటు వస్తే లేదా ఎక్కడైనా మెరుగైన అవకాశాలు ఉంటే అక్కడ విద్యను అభ్యసించారు. ఈ నేపథ్యంలో ఏపీ, టీజీ రాష్ట్రాల్లో ఎంబిబిఎస్ పూర్తి చేసి పీజీ కోర్సులో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఒక రాష్ట్రంలో ఎంబిబిఎస్ చదివినవారు, మరొక రాష్ట్రంలో స్థానికులుగా అనర్హులంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వింత నిర్ణయాలతో వైద్య విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టి వేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్లో ఎంబిబిఎస్ పూర్తి చేసి న వైద్య విద్యార్థులు పీజీ అడ్మిషన్ల కొరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎన్ టి ఆర్ యూనివర్శిటీ హెల్త్ సైన్స్ వారు సెప్టెంబర్ 27 వరకు అవకాశం ఇవ్వగా తెలంగాణకు చెంది ఏపీలో ఎంబిబిఎస్ పూర్తి చేసిన వారు అక్కడ స్థానికేతరులని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో తెలంగాణ విధ్యార్ధులు నష్టపోయారు.

సుప్రీమ్ కోర్టు ఏమిచెప్పింది……

ఇటీవల స్థానిక,స్థానికేతర విషయం పై జరిగినవాదనలో 5 సంవత్సరాల ఎంబిబిఎస్ ఏ రాష్ట్రం లో పూర్తి చేస్తే అక్కడనే పి జి కోర్సుల్లో ప్రవేశానికి స్థానికులవుతారని తీర్పునిచ్చింది. ఆ తీర్పు ప్రకారంఎంబిబిఎస్ఎక్కడపూర్తిచేస్తేఅక్కడే స్థానికత వర్తిస్తుందని స్పష్టంగా పేర్కొంది. ఆ తీర్పును ఏపీ ప్రభుత్వం అమలు చేయడంలేదు.

ఏ పి ప్రభుత్వం ఏమి చెబుతుంది….

1నుండి 12 వ తరగతి వరకు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులవుతారని,ఆ నింబందన ప్రకారం.. తెలంగాణ విధ్యార్ధులు ఏ పి లో స్థానికేతరు లేనని తేల్చి చెబుతుంది. కనీసం ఎస్సి , ఎస్టీ విద్యార్థులకు రిజర్వేషన్ కూడా అమలు చేయడం లేదు. దీంతో ఏపీలో ఎంబిబిఎస్ పూర్తి చేసిన తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఇక తెలంగాణ లో కాళోజీ నారాయణ రావు యూనివర్శిటీ హెల్త్ సైన్స్ వారు పీజీ అడ్మిషన్ల కొరకు అక్టోబర్ 16 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడాని అవకాశం ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్లో ఎంబిబిఎస్ పూర్తి చేసిన వారు సుప్రీం తీర్పు ప్రకారం తెలంగాణలో పిజి కోర్సుల్లో చేరడానికి స్థానిక త వర్తించదని స్పష్టం చేసింది.దీనితో ఏపీలో చదివిన విద్యార్థుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది.

రాష్ట్ర విభజన అనంతరం కూడా పది సంవత్సరాలు ఉమ్మడి హక్కులు వర్తిస్తాయని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొనడం తో ఎలాంటి భయం లేకుండా తెలంగాణ విద్యార్థులు వాళ్లకున్న అవకాశాలను బట్టి అవకాశాలను బట్టి ఆంధ్రప్రదేశ్ లో ఎంబిబిఎస్ పూర్తి చేశారు.ఇప్పుడు పిజీ కోర్సుకి వచ్చేసరికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పొంతనలేని నిర్ణయాలను అమలు చేస్తుండటంతో తెలంగాణకు చెందిన సుమారు 5వేల మెడికల్ విద్యార్థులు అడ్మిషన్ దొరక్క గాలిపటంలా గాలిలో తేలాడే పరిస్థితి ఏర్పడింది. విభజన చట్టంలో పొందు పరచిన విభజన హామీ ప్రకారం తెలంగాణలో ఎలా స్థానికులు కారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.

అదేవిధంగా సుప్రీమ్ తీర్పు ప్రకారం ఏపీలో ఎంబిబిఎస్ పూర్తి చేసిన విద్యార్థులు ఏపీలో స్థానికేతరులు ఎలా అవుతారో తేల్చి చెప్పాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుండి 12వ తరగతి వరకు తెలంగాణా లో చదివిన విద్యార్థులను స్థానికులగా గుర్తించాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు సుమారు 5 వేల మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టి వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆల్ ఇండియా కోటాలో ఏ రాష్ట్రంలో నైనాఎంబిబిఎస్ చదివే అవకాశం ఉంది.అనేక మంది విద్యార్థులు ఈ అవకాశం తోనే వివిధ రాష్ట్రాల్లో వైద్య విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. స్థానికత అనేది జన్మస్థలం ఆధారంగా లేదా పాఠశాల విద్య ఆధారంగా నిర్ణయించాలి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎంబిబిఎస్ చదవలేదు కాబట్టి ఇక్కడ పీజీ కోర్సులకు స్థానికులు కారంటూ పేర్కొనడం ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు అలాంటప్పుడు రాష్ట్ర విభజనలో 10 సంవత్సరాల ఉమ్మడి హక్కుల మాటేమిటి అని అడుగుతున్నారు.

సుప్రీంకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోదు,చట్టంలో పొందుపరిచిన విధంగా జన్మస్థలం లేదా పాఠశాల విద్యా ఆధారంగా స్థానికతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరచదు మరి ఇతర రాష్ట్రాల్లో ఐదు సంవత్సరాలు వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థుల పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు వాపోతున్నారు. పి జి కోర్సుల్లో ప్రవేశం కొరకు విధ్యార్ధులు రిజిస్ట్రేషన్ రుసుము కూడా చెల్లించారు.

ఇది ఇలావుండగా ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఎంబి బి స్ పూర్తి చేసి ప్రస్తుతం తెలంగాణాలో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న వారికి పి జి కోర్సుల్లో ప్రవేశానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. మరి ఇప్పుడు పూర్తి చేసిన వారి పట్ల వివక్ష ఎందుకని విధ్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని తెలంగాణ పాఠశాలలో విద్యను అభ్యసించి ఏపీలో ఎంబిబిఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Leave a Reply