బాణసంచా తయారీ, నిల్వల ప్రక్రియలో

  • భద్రతా నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు..
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన,అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ పీవీ రమణ…


(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : బాణసంచా తయారీ (firecrackers Manufacture), నిర్వహణ, నిల్వ ప్రక్రియలలో భద్రతా ప్రమాణాలను పాటించి అగ్ని ప్రమాదాలు, పేలుళ్లను నివారించేందుకు నిర్ధేశించిన ప్రామాణిక నిర్వహణ విధానాలను ఖచ్చితంగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ పీవీ రమణ (PV Ramana) శనివారం తెలిపారు. పేలుడు పదార్థాల నియమాలు, 2008 కి అనుగుణంగా, లైసెన్స్ పొందిన తయారీదారులు విధిగా భద్రతా చర్యలను పాటించాలని వీటిలో ముఖ్యంగా తయారీ భవనాలు బేస్మెంట్లు లేకుండా ఒకే అంతస్తు నిర్మాణాలుగా ఉండాలన్నారు.

బాణసంచా తయారీ షెడ్లు ఒకదానికొకటి, జనావాస ప్రాంతాల నుండి కనీసం 45 మీటర్ల సురక్షిత దూరంలో ఉండాలన్నారు. కర్మాగారాల్లో దూళి, దుమ్ము లేకుండా తగిన జాగ్రత్తలతో గృహ నిర్వాహక పద్ధతులను పాటించాలన్నారు. ఫ్యాక్టరీ లోపల ఎటువంటి ఫైర్ సంబంధిత మంటలు, ధూమపానం, అగ్గిపెట్టెలు, లైటర్లు, మొబైల్ ఫోన్లు ఖచ్చితంగా నిషేధించబడ్డాయన్నారు. తయారీ కార్యకలాపాలు ఉదయం 7:30 నుండి సాయంత్రం 5:30 వరకు మాత్రమే కార్యకలాపాలు నిర్వహించుకోవాలన్నారు. రసాయన మిక్సింగ్ వంటి ప్రమాదకర ప్రక్రియలను మానవ తప్పిదాలను తగ్గించడానికి ఆటోమేటిగా చేయాలన్నారు.

పేలుడు పదార్థాలను నిర్వహించడానికి స్పార్కింగ్ కాని సాధనాలను మాత్రమే ఉపయోగించాలన్నారు. ప్రతి కార్మికుడు వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించాలన్నారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిని, మద్యం సేవించిన వారిని ఫ్యాక్టరీలోకి అనుమతించకూడదన్నారు. ఉద్యోగులకు భద్రతా విధానాలు, అత్యవసర ప్రతిస్పందనలపై సమగ్ర శిక్షణ ఇవ్వాలన్నారు. కార్మికులకు జీవిత బీమా,వైద్య బీమా పాలసిని చేయాలన్నారు. ఫ్యాక్టరీలలో ఆటోమేటిక్ అగ్ని గుర్తింపు వ్యవస్థలు, తగిన అగ్నిమాపక యంత్రాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. లైసెన్స్ పొందిన తయారీదారులు అందరూ మార్గదర్శకాలను పాటించాలని, తద్వారా సురక్షితమైన పని వాతావరణాన్ని ఏర్పరచి, ప్రజా భద్రతకు భరోసా ఇవ్వాలన్నారు. భద్రతా నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని డైరెక్టర్ జనరల్ పీవీ రమణ తెలియజేశారు.

Leave a Reply